Rowdy Sheet Opened Against Pinnelli Brothers: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి గట్టి షాక్ తగిలినట్లు సమాచారం. వీరిపై మాచర్ల పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల రోజు, అనంతరం జరిగిన అల్లర్లలో ప్రమేయంపై ఇప్పటికే వీరిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో రెండు 307 కేసులు, మహిళను దూషించిన మరొక కేసు నమోదైంది. దీంతో వీరిపై మాచర్ల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు.
ఎన్నికల రోజు మాచర్ల (Macharla) నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ కు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎంను పగులగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం బయటకురావడంతో అది వైరల్ గా మారింది. దీన్ని ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధం కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మాత్రం ఎన్నికల రోజు నుంచి ఇప్పటి వరకు ఇంకా పరారీలోనే ఉన్నారు.