Rains: ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. అయితే ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణ రాష్ట్రం పై పెద్దగా ఉండదని..అయినప్పటికీ కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. శని, ఆదివారాల్లో 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.
ఈ మేరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు.
హైదారాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్లాయిలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు.