/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/eatala-Rajendar-jpg.webp)
సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు రాజేందర్. తాము, బీఆర్ఎస్ ఒకటేనని చేసిన ప్రచారం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు ప్రజల్లో ఆ భావన లేదన్నారు. బీఆర్ఎస్ కు, తమకు మధ్య ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయ్యే పరిస్థితిలో ఉందన్నారు. తెలంగాణ అంతటా పని చేశానని.. మల్కాజ్ గిరిలో తాను లోకల్ కాదు అన్న మాటలు అర్థ రహితమన్నారు. 32 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నానన్నారు. టికెట్ రాని నేతల నుంచి తనకు సహకారం అందడం లేదన్న వార్తలు అవాస్తవమన్నారు. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా తన గెలుపు కోసం పని చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు తన కోసం పని చేస్తున్నారన్నారు. ప్రలోభాల కాలంలో కొందరు పార్టీని వీడడం సహజమన్నారు.
హుజూరాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజ్ గిరిలో చెల్లుతుందా? అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా ఈటల మండిపడ్డారు. ఇతరులను విమర్శించే ముందు తమ స్థాయి, స్థానం ఏంటో తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీకి 12 ఎంపీ స్థానాలు వస్తాయన్నారు. బీజేపీకి గతంలో పెద్దగా ఓటు బ్యాంకు లేని ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మోడీని గెలిపించాలన్న భావన వ్యక్తం అవుతోందన్నారు. తనకు హైకమాండ్ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తోందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కవిత అరెస్టుకు, ఎన్నికలకు సంబంధం లేదన్నారు.
మోడీ హయాంలో దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. రాముడిని పూజించడం ఈ రోజు ప్రారంభం కాలేదన్నారు. ప్రపంచానికి రెండు గొప్ప ఇతిహాసాలు రామాయణం, మహాభారతం అందించిన గొప్ప చరిత్ర మన దేశానికి ఉందన్నారు. రామాయనాన్ని బీజేపీ తమ ఎజెండాగా మార్చుకోలేదన్నారు. 'రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈటల ఫైర్ అయ్యారు. ఆయనవి అహంకారపూరితమైన మాటలన్నారు. ప్రజల విశ్వాసాలను అగౌరపరిచే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దన్నారు.
అవినీతి రహిత దేశం, పాలనే బీజేపీ మూల సిద్ధాంతమన్నారు. రేవంత్ రెడ్డికి ముదిరాజ్ లపై ప్రేమ ఉంటే ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే ముదిరాజ్ లకు మంత్రి పదవి ఇస్తామనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ చేయదన్నారు. తనకు గెలుపుపై ఎలాంటి టెన్షన్ లేదన్నారు. మల్కాజ్ గిరిలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తాను తెలియని కుటుంబం లేదన్నారు. ఈటల రాజేందర్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.