ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections 2023) ఉమ్మడి నల్గొండ జిల్లా తమ కంచుకోట అని మరో సారి నిరూపించుకుంది కాంగ్రెస్ పార్టీ. జిల్లాలో మొత్తం 12 స్థానాలకు గానూ.. 11 స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులే భారీ మెజార్టీతో గెలుపొందారు. కేవలం సూర్యాపేటలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి చేతిలో 4606 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కేవలం మూడు స్థానాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందినా.. ఎంపీ ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలోని రెండు సెగ్మెంట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నల్గొండ ఎంపీగా ఉత్తమ్, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే రెండు ఎంపీ స్థానాలను గెలుచుకున్న చరిత్ర తమదని.. ఈ ఎన్నికల్లో సునాయసంగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: TS Congress: మల్కాజ్‌గిరిలో మైనంపల్లికి బిగ్ షాక్.. తుమ్మల ప్లాన్ ఇదేనా?
అయితే.. కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారన్న అంశం మాత్రం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్, భువనగిరి నుంచి గెలిచిన కోమటిరెడ్డి ఇద్దరూ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా విజయం సాధిండంతో వీరు పోటీ చేసే అవకాశం లేదు. రెండు స్థానాల్లోనూ కొత్త వారే పోటీ చేయనున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే.. సూర్యాపేట టికెట్ దక్కని రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. అప్పటి నల్గొండ ఎంపీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా హమీ పత్రం కూడా ఆయనకు రాసిచ్చారు.
అయితే.. పార్టీ గెలవడం, సూర్యాపేటలో ఓడి పోవడంతో రమేష్ రెడ్డి మనసు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూర్యాపేటకు తానే ఇన్ఛార్జి అంటూ దామోదర్ రెడ్డి ప్రకటించుకోవడంతో అలర్ట్ అయిన రమేష్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీగా ఎన్నికై సూర్యాపేట నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సూర్యాపేటలో టాక్ నడుస్తోంది. పటేల్ రమేష్ రెడ్డి వినతిని హైకమాండ్ అంగీకరిస్తే.. నల్గొండ ఎంపీగా జానారెడ్డికి లైన్ క్లీయర్ అయినట్లేనన్న చర్చ సాగుతోంది.
ఇంకా.. భువనగిరి విషయానికి వస్తే.. 2009లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2014లో టీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్య గౌడ్, 2019లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. దీంతో మరో సారి తమ కుటుంబ సభ్యులకే అవకాశం కల్పించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణికి టికెట్ ఇవ్వాలని వారు అడుగుతున్నట్లు చర్చ సాగుతోంది. అయితే.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి నియోజకర్గంలో పార్టీ గెలుపుకోసం పని చేశారు. రేవంత్ రెడ్డి సపోర్ట్ తో తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు. అయితే.. సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కూడా భువనగిరి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.