Shock To BRS : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు(BRS) మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు గుత్తా నివాసానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీప్‌దాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) వెళ్లి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు అంగీకరించడంతోనే కాంగ్రెస్(Congress) అగ్రనేతలు గుత్తా నివాసానికి వెళ్లి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అనంతరం కోమటిరెడ్డి, దీప్ దాస్ మున్షీ తో పాటు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు అమిత్ రెడ్డి. అమిత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉమ్మడి నల్లగొండ పాలిటిక్స్ పై మంచి పట్టు ఉంది. టీడీపీ(TDP) నుంచి ఒక సారి, కాంగ్రెస్ నుంచి 2 సార్లు ఆయన ఎంపీగా గెలుపొందారు. 2014లో విజయం తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు.
ఇది కూడా చదవండి: KCR: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నిక.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పై నేరుగా విమర్శలు..
సీఎం కేసీఆర్ గుత్తాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవి దక్కింది. అయితే.. తన కుమారుడిని భువనగిరి లేదా నల్లగొండ నుంచి ఎంపీగా బరిలో ఉంచాలని సుఖేందర్ రెడ్డి భావించారు. అయితే.. పార్టీలో వర్గ విభేదాల కారణంగా వెనక్కు తగ్గారు సుఖేందర్ రెడ్డి. ఇటీవల బీఆర్ఎస్ పై నేరుగా విమర్శలు చేశారు. దీంతో గుత్తా ఫ్యామిలీ పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం సాగింది.
నల్లగొండపై కాంగ్రెస్ ఫోకస్..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సైతం గుత్తాపై ప్రతి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గుత్తా కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీల్లో అసంతృప్తులపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ చేరిక జరిగినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్న వలసలు ఉంటాయని హస్తం నేతలు చెబుతున్నారు.
సుఖేందర్ రెడ్డి చేరిక ఎప్పుడు?
శాసనమండలి చైర్మన్ గా రాజ్యంగబద్ధ పదవిలో ఉండడంతోనే గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరలేదని తెలుస్తోంది. ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది. పదవీకాలం ముగిసేవరకు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం లేదన్న చర్చ సాగుతోంది. మండలిలో ప్రస్తుతం బీఆర్ఎస్ కే మెజార్టీ సభ్యులు ఉన్నారు. దీంతో గుత్తా చైర్మన్ గా కొనసాగితే తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.