Lok Sabha Sessions: జూన్ 15 నుంచి 22వ తేదీ వరకు 18వ లోక్ సభ తొలి సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల మూడో వారంలో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారాలతో సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించాయి. రెండు రోజుల పాటు ప్రమాణ స్వీకారాలు జరిగే అవకాశం ఉందని, అనంతరం స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నాయి. ఆ తర్వాతి రోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించాయి. సమావేశాలు జరుగుతుండగానే తొలి సెషన్ ముగింపుపై కొత్తగా ఎంపికైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలిపాయి. ఈ సమావేశాల్లో భాగంగా ప్రధాని మంత్రి తన కేబినెట్ ను ఉభయ సభలకు పరిచయం చేయనున్నట్లు సమాచారం.
రేపు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం..
మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7–15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. కాగా అంతకు ముందు మోదీని NDA పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్లు, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించిన విషయం తెలిసిందే.