Danam Nagender: ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు షాక్ తగిలింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు పీ.జే.ఆర్ కూతురు విజయా రెడ్డి. పిటిషన్ ను విచారించిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి దానంకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డి దానం నాగేందర్ పై పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే.
ALSO READ: బీజేపీ లోక్‌సభ ఎన్నికల నాలుగో జాబితా విడుదల..
ఓటర్లను ప్రలోభపెట్టారు..
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని విజయా రెడ్డి తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అలాగే.. తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని అన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ దానంకు నోటీసులు జారీ చేసింది. విచారణ వచ్చే నెల 18వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
సికింద్రాబాద్ ఎంపీగా పోటీ..
ఇటీవల పార్టీలో చేరిన దానం నాగేందర్ కు కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అయితే.. తనకే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు హస్తం హ్యాండ్ ఇచ్చింది.ఆయనకు కాకుండా దానం కు కేటాయించింది. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో టఫ్ ఫైట్ ఉండనుంది. మూడు ప్రధాన పార్టీల నుంచి బలమైన నాయకులు బరిలోకి దిగనున్నారు.
* కాంగ్రెస్ - దానం నాగేందర్
* బీజేపీ - కిషన్ రెడ్డి
* బీఆర్ఎస్ - పద్మారావు (దాదాపు ఖరారైనట్లు సమాచారం)
మరి వీరి ముగ్గురులో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాలి.