భువనగిరి ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఎంపీగా విజయం సాధించారు. అయితే.. ఇటీవల ఆయన నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొత్తం మూడు సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు కోమటిరెడ్డి కుటుంబ సభ్యులే విజయం సాధించారు. దీంతో వారు నియోజకవర్గంలోని ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లలో బలమైన అనుచరవర్గాన్ని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గాన్ని తమ కంచుకోటగా మార్చుకున్నారు.
ఇది కూడా చదవండి: TSRTC: సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులు.. సాధారణ ఛార్జీలతోనే.. తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!
దీంతో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక వారి నిర్ణయం ప్రకారమే జరిగే అవకాశం ఉంది. అయితే.. వారి కుంటుంబ సభ్యులే మరో సారి పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్దన్న మోహన్‌రెడ్డి లేదా మోహన్‌రెడ్డి కుమారుడు సూర్యపవన్‌రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. మరో కీలక నేత టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
రేవంత్ రెడ్డితో చామలకు సన్నిహిత్యం..
ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితుడికి చామల కిరణ్ కుమార్ రెడ్డికి పేరు ఉంది. దీంతో ఆయనకు టికెట్ పక్కా అన్న ప్రచారం సాగుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఒప్పించకుండా చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు అంత ఇజీ కాదన్న చర్చ కూడా ఉంది.
గెలుపుపై కాంగ్రెస్ ధీమా..
అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోని 6 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం ఒక్క జనగామలోనే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో రానున్న లోక్ సభ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు పక్కా అని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సీటుపై గులాబీ జెండా ఎగుర వేయాలన్న లక్ష్యంతో బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది.