Snoring: కొంతమందిలో నిద్రపోతున్నప్పుడు గురక రావడం ఒక సాధారణ విషయంగా అందరు భావిస్తారు. కానీ గురక అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం.. ఇది ఇతర ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల కూడా గురక పెట్టే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. అయితే తాజగా అధ్యయనాల్లో గురకకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
అధిక రక్తపోటు ప్రమాదం
ఫ్లిండర్స్ యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా గురక పెట్టే వారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు. రక్తనాళాల్లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు అధిక రక్తపోటుకు దారితీస్తుందని పరిశోధనలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి స్ట్రోక్, ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.
88 శాతం మంది పురుషులే
ఈ అధ్యయనంలో మొత్తం 12287 వ్యక్తులను తీసుకున్నారు. వారిలో 15 శాతం మందిని 6 నెలల పాటు పర్యవేక్షించగా.. అందులో 20% కంటే ఎక్కువ మంది రాత్రి గురక పెట్టారు. రాత్రిళ్ళు ఎక్కువగా గురక పెట్టే వారిలో సాధారణ కంటే 3.8 mm Hg అధిక సిస్టోలిక్ రేట్, 4.5 mm Hg అధిక డయాస్టొలిక్ రేట్ ఉన్నట్లు గుర్తించారు. గురక పెట్టని వారి రక్తపోటు సాధారణంగానే ఉంది. రక్తపోటును సిస్టోలిక్, డయాస్టొలిక్ పరిమాణాలతో కొలుస్తారు. ఒక మనిషి సాధారణ రక్తపోటు 120/80 mm Hg. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది మధ్య వయసు వారే ఉన్నారు. ముఖ్యంగా 88 శాతం మంది పురుషులే ఉన్నారు. ఇలా గురక సమస్యతో బాధపడేవారు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.