IPS Aashna: 12TH ఫెయిల్...బాలీవుడ్‌లో 2023లో వచ్చిన ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. మధ్యప్రదేశ్ చంబల్ లాంటి కల్లోలిత ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ శర్మ..IPS ఎలా సాధించాడనే రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఐతే అచ్చం ఇలాంటిదే ఐపీఎస్ ఆష్నా చౌదరి కథ. ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలోని పిల్ఖువా అనే చిన్న టౌన్ నుంచి వచ్చిన ఆష్నా...IPS ఆఫీసర్‌గా మారిన స్టోరీ ఈ తరం యువతకు స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్‌మీడియాలో రెండున్నర లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆష్నా... రూరల్ ఏరియా నుంచి వచ్చినప్పటికీ పెద్ద కలలను ఎలా సాకారం చేసుకోవచ్చో నిరూపించింది.
పేద పిల్లలకు చదువు చెప్పేందుకు..
ఆష్నా చౌదరి తండ్రి అజిత్ సింగ్ పిల్ఖువా టౌన్‌లోని ప్రభుత్వ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తుండగా..ఆమె తల్లి సాధారణ గృహిణి. మధ్యతరగతి కుటుంబమైనప్పటికీ ఆష్నా తన లక్ష్యాన్ని చేరుకోవడంలో కుటుంబం చాలా సహకరించింది. పిల్ఖువాలోని సెయింట్ జేవియర్స్, ఉదయ్‌పూర్, ఘజియాబాద్‌లో తన స్కూల్ ఎడ్యూకేషన్‌ను పూర్తి చేసింది ఆష్నా. ఇంటర్ తర్వత ఢిల్లీకి చేరుకుంది ఆష్నా. శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్‌లో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక సౌత్ ఏషియన్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న సమయంలో UPSCపై ఫోకస్ పెట్టింది ఆష్నా. అదే సమయంలో పేద పిల్లలకు చదువు చెప్పేందుకు ఓ NGOతో కలిసి పని చేసింది.
యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా మొదలైందంటే..
2019లో డిగ్రీ పూర్తయిన వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఆష్నా. ఎలాంటి కోచింగ్ లేకుండా ఓ సంవత్సరం ప్రిపేర్ అయింది. ఐతే మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయింది. ఇక 2021లో రెండో సారి ప్రయత్నించగా...కేవలం రెండున్నర మార్కులతో వెనుకబడిపోయింది. ఐనప్పటికీ నిరాశ, నిస్పృహను దరి చేరనీయలేదు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె తండ్రి ఆమెకు మరింత ధైర్యాన్నిచ్చారు. దీంతో మూడో ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు ఆష్నా. మూడోసారి ప్రయత్నానికి ముందు గతంలో తను చేసిన తప్పులను మరోసారి రిపీట్ చేయకూడదన్న వ్యూహంతో ముందుకెళ్లింది. సిలబస్‌ను రివైజ్ చేసి..వీలైనంత వరకు మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేసింది. యూపీఎస్సీ అన్ని లెవల్స్‌లోనూ సత్తా చాటి 922 మార్కులతో 116వ ర్యాంకును సాధించింది. ఐతే ఆష్నా కావాలనుకుంటే ఐఏఎస్ వైపే వెళ్లొచ్చు కానీ ఇండియన్ పోలీస్ సర్వీస్ వైపు మొగ్గు చూపింది.
ఇక సోషల్‌మీడియాలోనూ ఆష్నా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు రెండున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాలో తన గ్లామరస్ లుక్, స్టైల్‌తో పాటు యువతను ఇన్‌స్పైర్ చేసే ఇన్ఫర్మేషన్‌ను పోస్ట్ చేస్తుంటారు ఆష్నా. ఇక ఈ వీడియోలను యూట్యూబ్‌లోనూ పోస్టు చేసి యువత తన లక్ష్యాలను సాధించే దిశగా ప్రోత్సహిస్తారు ఆష్నా.