ప్రతి మనిషికి ఏదోక సందర్భంలో కోపం వస్తుంటుంది. కానీ అది అతిగా మారినప్పుడు మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధిక కోపం గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మెదడు రక్తస్రావం, స్ట్రోక్, గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అందుకే దానిని నియంత్రించడం చాలా ముఖ్యం.
అకస్మాత్తుగా కోపం వచ్చినప్పుడు అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు వేగంగా విడుదలవుతాయి. ఈ హార్మోన్లు రక్త నాళాలను సంకోచిస్తాయి, రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. ఫలితంగా శ్వాస వేగంగా మారుతుంది. రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
అధిక కోపం ప్లేట్లెట్స్ గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి పరిస్థితులలో ప్లేట్ లెట్స్ రక్త నాళాలలో పేరుకుపోతాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైందని వైద్యులు అంటున్నారు.
నిరంతర కోపం శరీరం రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది నరాలపై ఒత్తిడిని పెంచుతుంది. రక్త నాళాలలో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. వ్యక్తి సులభంగా వ్యాధులకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు.
కోపం శరీరంపై మాత్రమే కాకుండా వ్యక్తి ప్రవర్తన, సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. మితిమీరిన కోపం కారణంగా ఒక వ్యక్తి ఏకాగ్రతతో ఉండలేడు. ఇతరులతో అతని ప్రవర్తన క్షీణిస్తుంది. సంబంధాలలో వాదనలు, తగాదాలు పెరుగుతాయి. ఇది సంబంధాన్ని పాడు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
కోపాన్ని తగ్గించుకోవడానికి, ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా చేయవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. కోపం నియంత్రణలో లేకుంటే మాత్రం నిపుణుల సలహా తీసుకోవాలి.