విద్యుత్ సవరణ చట్టాలను తీసుకు వచ్చి ప్రజలపై ప్రభుత్వాలు భారాలను మోపుతున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య అన్నారు. విద్యుత్ ధరలను పెంచాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాకు సీపీఐ, సీపీఎం, వామపక్ష పార్టీలు హాజరయ్యాయి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలను పెంచిందన్నారు. దీంతో ప్రజలపై తీవ్ర భారం పడిందన్నారు. విద్యుత్ సమస్యలపై 2000 సంవత్సరంలో బషీర్ బాగ్ లో జరిగిన ఉద్యమం మరోసారి పునరావృతం కానుందని ఆయన అన్నారు. మరోవైపు విజయవాడలో విద్యుత్ పోరాట అమర వీరులకు వామపక్ష నాయకులు నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా సీపీఎం నేత బాబూరావు మాట్లాడుతూ... ప్రపంచ బ్యాంకు షరతులకు వ్యతిరేకంగా నాడు విద్యుత్ ఉద్యమం సాగిందన్నారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారన్నారు. ఇప్పుడు అదే స్పూర్తితో మరోసారి విద్యుత్ పోరాటానికి వామపక్షాలు సిద్దం అవుతున్నాయన్నారు. సీఎం జగన్ ప్రధాని మోడీ ఆదేశాలకు లొంగిపోయి ఎపీలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నారన్నారు.
నాలుగేళ్ల జగన్ పాలనలో ప్రజలపై రూ. 25వేల కోట్ల భారం మోపారన్నారు. విద్యుత్ చట్టాన్ని కూడా కేంద్రం సవరించాలని చూస్తోందని ఆరోపించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల విధానాన్ని అడ్డుకుంటామన్నారు. అదానీ సంస్థలకు దోచి పెట్టాలని జగన్, మోడీలు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు విద్యుత్ పోరాటంతో వెనక్కి తగ్గారన్నారు. ఇప్పుడు ప్రజల మద్దతుతో జగన్ కు తగిన బుద్ది చెబుతామన్నారు.