ఇది పేదల విజయం.. ఇక నుంచి "అమరావతి మనందరి అమరావతి"

అమరావతి ప్రాంతంలోని ఆర్5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంసభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు మంచి జరుగుతుంటే కోర్టుల్లో కేసు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

New Update
ఇది పేదల విజయం.. ఇక నుంచి "అమరావతి మనందరి అమరావతి"

CM Jagan

50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన..

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్5జోన్‌లో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేశారు. అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అక్కడ నిర్మించిన మోడల్‌ హౌస్‌ను కూడా సందర్శించి అధికారులను అభినందించారు. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లోని 25 లేఅవుట్‌లలో 50,793 ఇళ్ల నిర్మాణం జరగనుంది. . ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేయనుంది.

పెత్తందారులపై పేదల విజయం ఇది..

అనంతరం బహిరంగసభలో ప్రసగించిన జగన్.. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు. ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు అని తెలిపారు. ఇక నుంచి అమరావతి మనందరి అమరావతి అని వ్యాఖ్యానించారు. పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా ఆయన దీనిని అభివర్ణించారు. చంద్రబాబు.. దత్తపుత్రుడు.. దుష్ట చతుష్ఠం కలిసి పేదలకు ఇళ్లు రాకూడదనే కుట్ర చేశారని ఆరోపించారు. పేదవాడికి ఇల్లు రాకూడదని అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ఇందుకోసం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లారని దుయ్యబట్టారు. పేదల వ్యతిరేకులంతా కోర్టుల్లో 18కేసులు వేశారని పేర్కొన్నారు. అలాగే పేదవాడికి ఇంగ్లీష్‌ మీడియం అవసరమా? అని ప్రశ్నించిన వాళ్లు.. తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదివిస్తారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. మరి చంద్రబాబు తన హయంలో పేదలకు ఉపయోగపడే పనులు ఎందుకు చేయలేదు అని నిలదీశారు.

పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు..

ఇక సంబంధిత శాఖ మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నారు.. గూడు కల్పిస్తున్నారు.. ఆయనను ఎవరూ టచ్ కూడా చేయలేరన్నారు. పవన్ కల్యాణ్‌ పెళ్లాలనే కాదు పార్టీలను కూడా మారుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారనిపేర్కొన్నారు. ఊరపంది తిరిగినట్టు లోకేశ్ రోడ్లపై తీరుగుతున్నాడని విమర్శలు చేశారు. జగన్‌తో లోకేశ్‌కు పోటీనా అని ఎద్దేవాచేశారు. అలాగే పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి ముసలి నక్క చంద్రబాబు అని దుయ్యబట్టారు.

నల్ల బెలూన్లుతో అమరావతి రైతులు నిరసన..

మరోవైపు అమరావతి రైతులు కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెంకటపాలెం శిబిరాల వద్ద నల్ల బెలూన్లుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. . ఎగరేసి ఆర్ 5 జోన్‌ అంశంపై హైకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్నప్పటికీ.. ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. రాజధాని రైతులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తమ సమాధులపై నుంచి ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. రైతులు బయటకు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు