RTV Exclusive: మా ఓటమికి కారణం వారే.. కురియన్ కమిటీకి కాంగ్రెస్ అభ్యర్థులు ఏం చెప్పారంటే?

క్షేత్ర స్థాయిలో సపోర్ట్ దక్కలేదని కొందరు.. బీజేపీ వేవ్ తో నష్టపోయామని మరికొందరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు కురియన్ కమిటీ ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులు కురియన్ కమిటీకి ఏం చెప్పారన్న వివరాలు ఈ స్టోరీలో..

New Update
Telangana Congress: ఎందుకు ఓడారు.. కాంగ్రెస్ అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ!

గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం 8 సీట్లు మాత్రమే విజయం సాధించడంపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. ఆశించిన రీతిలో సీట్లు రాకపోవడం, అనూహ్యంగా బీజేపీ సైతం ఎనిమిది సీట్లు సాధించడం ఏంటనే అంశంపై విశ్లేషణ చేస్తోంది. ఇందుకు సంబంధించి పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ ఈ రోజు ఓటమి పాలైన అభ్యర్థులతో భేటీ అయ్యింది. ఆ అభ్యర్థులు తమ ఓటమికి కారణాలను కమిటీకి వివరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు కమిటీతో ఏం చెప్పారన్న వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్: గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ లో కేవలం బోధన్, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించిందని ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి కమిటీ ఎదుట వివరించినట్లు సమాచారం. పసుపుబోర్డు సాధించడం, హిందూ ఓట్లు పోలరైజ్ కావడం బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యిందని కమిటీ ఎదుట జీవన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా.. ఆ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం బీజేపీకి తరలడం కాంగ్రెస్ కు మైనస్ గా మారిందని వివరించారట. కవితను అరెస్ట్ చేయడంతో పాటు, ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం బీజేపీకి కలిసి వచ్చిందని జీవన్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు తనకు అంతగా సహకరించలేదని జీవన్ రెడ్డి చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

మహబూబ్ నగర్: కొందరు కింది స్థాయి కాంగ్రెస్ నేతలు తనకు అంతగా సహకరించలేదని ఇక్కడ పోటీ చేసి ఓటమి పాలైన వంశీచంద్ రెడ్డి కురియన్ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి అరుణ గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారని, మంత్రిగా కూడా పని చేశారని చెప్పినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ కేడర్ తో ఆమెకు ఉన్న సంబంధాలు బీజేపీ విజయానికి కలిసి వచ్చాయని ఆయన వివరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంతో తాను స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. డీకే అరుణకు ఆమె తండ్రి, భర్త ఫ్యామిలీల బ్యాక్ గ్రౌండ్ కలిసి వచ్చిందని వివరించినట్లు సమాచారం.

మల్కాజ్ గిరి: ఆఖరి నిమిషంలో తనను అభ్యర్థిగా ప్రకటించడం మైనస్ గా మారిందని కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కమిటీ ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో ప్రచారంలో తనకు ఇబ్బంది ఎదురైందని వివరించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే సానుకూల వాతావరణం ఉండేదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంకా బీజేపీకి ఇక్కడ మంచి సంఖ్యలో కార్పొరేటర్లు ఉండడంతో వారికి క్షేత్ర స్థాయిలో కలిసి వచ్చిందని ఆమె చెప్పారట. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా.. ఆ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం బీజేపీకి తరలిందని వివరించినట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు తన పాత పార్టీ బీఆర్ఎస్ లోని నేతల నుంచి సహకారం అందిందని.. ఈ కారణాలతో తాను ఓటమి పాలయ్యానని ఆమె వివరించినట్లు సమాచారం. ఇంకా సోషల్ మీడియాలో తాను నాన్ లోకల్ అంటూ చేసిన ప్రచారం కూడా మైనస్ గా మారిందని చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు తన గెలుపు కోసం అంతగా పని చేయలేదని ఆమె వివరించినట్లు తెలుస్తోంది.

చేవెళ్ల: ఇక్కడ బీజేపీ నుంచి బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లో పని చేయడం ఆయనకు కలిసి వచ్చిందని కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కురియన్ కమిటీకి వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు రెండూ తననే టార్గెట్ చేశాయని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. తనపై చేసిన అవినీతి, ఇతర ఆరోపణలు, సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం నష్టం చేశాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారట. క్షేత్ర స్థాయి నాయకులు కొందరు బీజేపీ కోసం పని చేశారని ఆయన చెప్పినట్లు సమాచారం. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ వేవ్ విశ్వేశ్వర్ రెడ్డికి కలిసివచ్చిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఫలితం మారేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. తన చేరికను కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేదని ఆయన డైరెక్ట్ గానే చెప్పినట్లు సమాచారం.

ఆదిలాబాద్: ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉండడం బీజేపీకి కలిసివచ్చిందని కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ కమిటీ ఎదుట చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ కు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉండడంతో ప్రచారంలో ఇబ్బంది కలిగిందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయి కేడర్ కూడా ఉత్సాహంగా పని చేయలేదని ఆమె చెప్పినట్లు సమాచారం. ఆర్థిక అంశాల్లోనూ తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె వివరించినట్లు తెలుస్తోంది.

కరీంనగర్: ఆఖరి నిమిషంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం మైనస్ గా మారిందని వెలిచాల రాజేందర్ రావు కమిటీ ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ ప్రవీణ్‌ రెడ్డి వర్గం అంతగా సహకరించలేదని చెప్పినట్లు సమాచారం. ఇక్కడ బీఆర్ఎస్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా.. ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితమైందని.. ఆ పార్టీ ఓటు బ్యాంకు బీజేపీకి తరలడమే ఇందుకు కారణమని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇదే తనను దెబ్బకొట్టిందని వివరించినట్లు తెలుస్తోంది. కొందరు ముఖ్య నాయకులు సైతం తన గెలుపు కోసం సీరియస్ గా పని చేయలేదని ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మెదక్: ఈ సెగ్మెంట్లో 6 గురు ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఈ సారి అంతగా సీరియస్ గా పని చేయకపోవడం బీజేపీకి కలిసివచ్చిందని నీలం మధు కమిటీకి వివరించినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా.. ఓటు బ్యాంక్ భారీగా పెరిగిందని చెప్పినట్లు సమాచారం. అయితే.. కొందరు ముఖ్య నేతలు సీరియస్ గా పని చేయకపోవడం కారణంగానే తాను స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని ఆయన చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.

సికింద్రాబాద్:
తాను ఆఖరి నిమిషంలో అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ 4,23,068 ఓట్లు సాధించానని దానం నాగేందర్ పార్టీ కమిటీ ఎదుట చెప్పినట్లు సమాచారం. కొందరు క్షేత్ర స్థాయి నేతలు, గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు సీరియస్ గా పని చేస్తే గెలిచేవాడిని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ 6 ఎమ్మెల్యేలను గెలుచుకుందని.. కానీ ఈ సారి కేవలం 1,29,586 ఓట్లను మాత్రమే సాధించిందని వివరించినట్లు సమాచారం. ఆ పార్టీ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్లిందని.. ఇది కూడా తనకు మైనస్ గా మారిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మెజార్టీ హిందూ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్లడం తో ఆ పార్టీ విజయం సాధించినట్లు ఆయన వివరించారని తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు