కేసీఆర్ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ..
కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్).. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న నేత. ఉద్యమ సమయంలో కేసీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన కొద్దికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకత దక్కించుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకుని వచ్చినా తెలంగాణ యాసపై పట్టు మాత్రం కోల్పోలేదు. తెలంగాణ యాసలో అలవోకగా మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రాష్ట్రానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు వచ్చేలా కృషిచేశారు. సెకండ్ టైర్ సిటీలైన వరంగల్, కరీంనగర్ నగరాల్లోనూ ఐటీ హబ్‌లు నిర్మించారు.
రాష్ట్రాభివృద్ధిలో తనదైన ముద్ర..
ఐటీతో పాటు పురపాలకశాఖ మంత్రిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు వేయించడం, రోజూ నల్లా నీళ్లు అందేలా చేశారు. ఇక రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చిదిద్దేలా ఫ్లైఓవర్లు నిర్మించడంలోనూ కీలకపాత్ర పోషించారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు వివిధ దేశాల్లో జరిగే బిజినెస్ సమ్మిట్స్‌లో పాల్గొని నిధులు వచ్చేలా శ్రమించారు. ఇలా తనదైన పంథాలో ముందుకుపోతూ రాష్ట్రాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. సోమవారం 47వ పడిలోకి అడుగుపెడుతున్న కేటీఆర్ పుట్టినరోజును పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రమంతా కేటీఆర్ ఫ్లెక్సీలతో నింపేశారు.
సిద్ధిపేటలో జననం.. అమెరికాలో ఉద్యోగం..
కేటీఆర్ సిద్ధిపేటలో 1976 జులై 24న కేసీఆర్, శోభ దంపతులకు జన్మించారు. పుట్టినదగ్గరి నుంచే ఆయన రాజకీయ వాతావరణంలో పెరిగారు. ఆయన స్కూల్ విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో జరిగింది. అనంతరం నిజాం కాలేజీలో మైక్రోబయాలజీలో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం పుణేలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మార్కెటింగ్ అండ్ ఈకామర్స్‌లో ఎంబీఏ పట్టా పొందారు. చదువు అయిపోయిన తర్వాత 2001 నుంచి 2006 దాకా ఐటీ జాబ్ చేశారు. ఆ తర్వాత రాజకీయాలపై మక్కువతో 2006లో హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.