KTR America Trip: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ అమెరికా వెళ్లారు. అందులో పెద్దగా ఆశ్చర్యం ఏముంది. ఎదో పని ఉంటుంది వెళ్లి ఉండవచ్చు అని అందరూ అనుకోవడం సహజమే. కానీ, రాజకీయాల్లో అలా ఉండదుగా.. కేటీఆర్ ఇంత సడన్ గా అమెరికా ఎందుకు వెళ్లినట్టు? అంటూ బోలెడన్ని రీజన్లు తెరమీదకు తీసుకువస్తున్నారు. అటు కవిత జైలు నుంచి రాగానే ఇటు కేటీఆర్ అమెరికా వెళ్లడం వెనుక పెద్ద కథే ఉంది అంటూ ప్రత్యర్ధులు ఊహాగానాలు చేసేస్తున్నారు. తన కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నాడనీ, అతనిని చూసి రావడానికి వెళుతున్నాననీ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ, ప్రత్యర్ధులు మాత్రం కేటీఆర్ అమెరికా వెళ్లడం వెనుక పెద్ద రీజన్ ఉందంటూ ప్రచారం చేసేస్తున్నారు.
KTR America Trip: కేటీఆర్ అమెరికా పర్యటనకూ, ఫోన్ టాపింగ్ కేసుకూ ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన బాధ్యుడిగా భావిస్తున్న తెలంగాణ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రభాకరరావు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. ఈ కేసులో సీఐడీ ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ విచారణకు రావాలని పలుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే, తన ఆరోగ్యం బాగాలేదనీ, ట్రీట్మెంట్ కోసం అమెరికాలో ఉన్నాననీ చెబుతూ ప్రభాకర రావు విచారణకు రాకుండా కాలం గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అమెరికా పర్యటన ప్రభాకరరావును కలవడం కోసమే అనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.
KTR America Trip: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ ఆరోపణలపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ విచారణలో విస్తుకొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువుఋ ముఖ్యులపై ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తేలింది. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన నేతలు, వ్యక్తులపై ఫోన్ ట్యాపింగ్ తో నిఘా పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో త్వరితగతిన విచారణ చేసిన సీఐడీకి అప్పటి ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రభాకరరావు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే విషయాలు వెలుగు చూశాయి. దీంతో ప్రభాకర రావును విచారణ చేయాలని సీఐడీ భావించింది. కానీ, తన అనారోగ్య కారణాలు చూపిస్తూ ప్రభాకర రావు అమెరికాలో వైద్య పర్యవేక్షణలో ఉన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ప్రభాకరరావు అప్పట్లో కేసీఆర్, కేటీఆర్ లకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.
KTR America Trip: ఇప్పుడు ఆ సాన్నిహిత్యం కారణంగానే ప్రభాకరరావును కలవడం కోసమే కేటీఆర్ అమెరికా వెళుతున్నారనీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర రావు అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు బయటపెట్టకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనీ అంటున్నారు. ప్రభాకరరావు విచారణకు హాజరు అయితే, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కేసులో ఇరుక్కునే అవకాశాలున్నాయని ఆ వర్గాలు అంటున్నాయి. అందుకోసమే తమ పేర్లు బయటకు రాకుండా ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాన్ని చర్చించడం కోసమే అమెరికా వెళ్లి ప్రభాకరరావును కేటీఆర్ కలవబోతున్నారని గుసగుసలాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్ధులు.
KTR America Trip: మొత్తంమ్మీద ఇటీవల తెలుగురాష్ట్రాల నేతలు విదేశీ ప్రయాణాలకు వెళితే అది సంచలనంగా మారుతోంది. ప్రత్యర్థుల ఆరోపణలతో రాజకీయం హీటెక్కి పోతోంది. ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతుంటాయి. అలాగే చంద్రబాబు, లోకేష్ విదేశాలకు వెళితే వారిపై ఆరోపణలతో వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది. ఇదిగో ఇప్పుడు కేటీఆర్ అమెరికా ప్రయాణం కూడా ఇలానే ఆరోపణలతో హీటు పుట్టిస్తోంది.