గుడివాడ ఏరియా ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆసుపత్రి వెనుక గేటు సహా.. ఆర్చి నిర్మాణం నిమిత్తం ప్రధాన ద్వారాన్ని ఐరన్ రాడ్‌లతో మూసివేశారు. ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి. మంగళవారం పట్టణానికి చెందిన యువకుడికి గుండెపోటు రావడంతో బంధువులు హుటాహుటిన ఏరియా ప్రభుత్వాసుపత్రికి ఆటోలో తీసుకువచ్చారు. ప్రధాన ద్వారం మూసిఉండటంతో.. అక్కడే ఉన్న కొందరు వెనుక ద్వారం గుండా లోపలికి వెళ్లాలని చెప్పారు. పరుగున వెనుక ద్వారం వైపునకు తీసుకువెళ్లగా అక్కడా గేటు మూసి ఉండటంతో చుక్కెదురైంది.
స్ట్రెచర్ కూడా వెళ్లలేని పరిస్ధితి
తిరిగి ప్రధాన ద్వారం ద్వారా యువకుడిని భూజాన వేసుకుని లోపలికి పరుగు పరుగున వెళ్ళారు. కనీసం స్ట్రెచర్ కూడా వెళ్లలేని పరిస్ధితి. వైద్యులు పరిశీలించి అప్పటికే యువకుడు మృతి చెందినట్టు చెప్పారు. అరగంట పాటు ఆసుపత్రి ద్వారాల వద్ద జరిగిన జాప్యం కారణంగా వ్యక్తి మృతి చెందాడని సకాలంలో వైద్యం అందితే యువకుడు బతికేవాడని స్థానికులు పేర్కొంటున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవి వ్యాఖ్యలకు మృతుడి బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి ప్రాణం కన్నా వస్తువుకు విలువ యిస్తున్నారని, కనీసం లోపలికి తీసుకువచ్చేందుకు దారిలేదని చెప్పినా సూపరింటెండెంట్ మాటదాటేశారని ఆరోపించారు.
సూపరింటెండెంట్ వ్యాఖ్యలు బాధాకరం
ముందుగా ఆర్‌ఎంపీ వైద్యుని వద్దకు రోగిని తీసుకువెళ్ళారని, అక్కడే మృతి చెందారని మృతుడిని పరీక్షించిన వైద్యులు చెప్పారంటూ సూపరింటెండెంట్ వ్యాఖ్యలు చేయడం బాధాకరం. సకాలంలో వైద్యం అందక మృతిచెందిన వ్యక్తి బంధువులపై స్థానిక వైసీపీ నాయకులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బెదిరింపులకు దిగారు. వైఎస్సాఆర్ బీమాతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను రాకుండా నిలిపివేస్తామని, మీడియా ఎదుట నోరు విప్పరాదని హుకుం జారీ చేయడం గమనార్హం.