చంద్రబాబు, లోకేశ్‌కు కృతజ్ఞతలు..
వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(kotamreddy sridhar reddy)ని నెల్లూరు రూరల్ టీడీపీ ఇంఛార్జిగా నియమిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయనను ఈ పదవిలో నియమించినట్లు తెలిపారు. ఇకపై శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పార్టీ కార్యకర్తలు, నేతలు కోటంరెడ్డికి సహకరించాలని పిలుపునిచ్చారు. దీంతో చంద్రబాబు, లోకేశ్‌కు శ్రీధర్ రెడ్డి కృతజ్ఙతలు చెప్పారు.
అధికారికంగా టీడీపీ సభ్యులు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. దీంతో ఆయన పనితీరుకు సంతృప్తి చెందిన అధిష్టానం పార్టీ ఇంచార్జిగా నియమించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇన్నాళ్లు టీడీపీ మద్దతుదారుడిగా ఉన్న ఆయన తాజా ఉత్తర్వులతో అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లైంది. ఇప్పటికే ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలకు ఏ సమస్య వచ్చినా ముందుంటున్నారు.
వైసీపీ నుంచి బహిష్కరణ..
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. తొలి నుంచి జగన్‌కు వీరవిధేయుడిగా ఉన్న ఆయన.. నియోజకవర్గ సమస్యలపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో పార్టీ పెద్దలు ఆయనను మందిలించారు. అయినా కానీ ప్రజల సమస్యలు తీర్చే వరకు వెనక్కి తగ్గేది లేదని శ్రీధర్ రెడ్డి విమర్శల తాకిడి పెంచారు. ఈ క్రమంలోనే వైసీపీతో ఆయనకు సంబంధం లేదని సజ్జల వంటి నేతలు వ్యాఖ్యాంచారు. ఇలాంటి తరుణంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం.. విప్ ఉల్లంఘించి టీడీపీకి ఓట్ వేశారనే కారణంతో శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి టీడీపీ పెద్దలతో టచ్‌లో ఉంటూ వస్తున్నారు.