సింహపురి రాజకీయాలు ప్రత్యేకం..
నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆ జిల్లా రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. సింహపురిలో ఏ పార్టీ అయితే మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందో ఆ పార్టీయే అధికారంలోకి రావడం పక్కా అనే నానుడు కూడా ఉంది. అలాంటి నెల్లూరు జిల్లా జగన్ పార్టీకి అండగా ఉంటూ వస్తోంది. అయితే ఇటీవల మారిన పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని పెద్దా రెడ్లందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా ఆనం, మేకపాటి, కోటంరెడ్డి కుటుంబాలకు జిల్లాలో మంచి పలుకుబడి ఉంది. వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయం సాధించడం ఖాయం.
టీడీపీలోకి పెద్దారెడ్డు..
అయితే ఇప్పుడు ఆ మూడు కుటుంబాల నుంచి కీలక నేతలు తెలుగుదేశం వైపు ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన లోకేష్ యువగళం పాదయాత్రను దిగ్విజయం చేశారు. ఇదే సమయంలో నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. బహిరంగంగానే ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. వీరి వ్యవహారం వైసీపీకి మరింత డ్యామేజ్‌గా మారగా.. టీడీపీకి ప్లస్ అయింది.
సైకిల్ ప్రభంజనం ఖాయం..
ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల బీజేపీ, వైసీపీకి చెందిన వందల మంది కార్యకర్తలు కోటంరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాబోయే ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. ఇప్పటికే తనపై నమ్మకంతో రెండు సార్లు గెలిపించారని ఇందుకు రుణపడి ఉంటానన్నారు. గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం తప్పదని వెల్లడించారు. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా పదికి పది నియోజకవర్గాల్లో టీడీపీ గెలవడం ఖాయమని కోటంరెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.