తెలుగు రాష్ట్రాల్లో వరదలు సృష్టిస్తున్న విధ్వంసానికి సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే మరోవైపు పశువుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వరదల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు అధికారులు. అటు పశువుల సంగతి మాత్రం పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా ఆవులు, గేదెల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా మంది రైతులకు ఈ రెండే జీవనాధారం. ముఖ్యంగా కోనసీమ జిల్లా(Konaseema district) లంక గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. గోదావరి(godavari) ఉగ్రరూపం దాల్చుతుండడంతో తమ పశువులను కాపాడుకునేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు రైతులు.
ఎలా రక్షించుకోవాలో తెలియక..:
కోనసీమ జిల్లాలో లంక గ్రామస్తుల ఆవేదనను కళ్లకు కట్టినట్టు చూపించింది ఆర్టీవీ. అక్కడి రైతులతో స్వయంగా మాట్లాడింది. పశువులను తరలించేందుకు గ్రామస్తులు పడుతున్న అవస్థలను ప్రజలకు చూపించింది. గోదావరి అవతల ఉన్న పశువులను మరో వైపునకు ఎలా తరలిస్తున్నారో రికార్డ్ చేసింది ఆర్టీవీ. లంక ఊర్లు నీటిలో మునిగిపోగా.. పశువులు చిక్కుకుపోయాయి. వాటిని పడవల్లో తరలిస్తున్నారు గ్రామస్తులు. ఇక పశువులు తినేందుకు మెత లేదని వాపోతున్నారు రైతులు. గేదెలను, ఆవులను ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న వరద ఉధృతి:
కోనసీమలో ప్రధాన నదులైన వృద్ధ గౌతమి, వశిష్ట వైనతేయ గోదావరి పాయలకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కోనసీమలో నదులన్నీ ఉధృతంగా ప్రవహస్తున్నాయి. వరద ఉధృతి పెరిగితే లంక గ్రామాలు మొత్తం మునిగిపోయే ప్రమాదముంది. అల్లూరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఎనిమిది మండలాల్లోని 120 గ్రామాలపై వరదల ఎఫెక్ట్ క్లియర్‌గా కనిపిస్తోంది. మొత్తం మీద, వరదల కారణంగా 51,600 మంది ప్రభావితమయ్యారు. అటు అల్లూరి జిల్లాలో 96 గ్రామాలు, ఏలూరు జిల్లాలో 22 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో రెండు గ్రామాలు ముంపునకు గురయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఏఎస్ఆర్, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత గ్రామాల నుంచి ఇప్పటివరకు 46,246 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం.
ఏఎస్‌ఆర్ జిల్లా చింతూరు, ఏలూరు జిల్లాలోని వేలయిర్‌పాడు, కుకునూరు, కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, మామిడికుదురు, అయినవల్లిలో సహాయిక బృందాలను ఏర్పాటు చేశారు. రెస్క్యూ టీమ్‌లు ఇప్పటివరకు వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మొత్తం మీద, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) నుంచి ఎనిమిది బృందాలు (230 మంది సిబ్బంది) ఐదు జిల్లాల్లో మోహరించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్(NDRF) 10వ బెటాలియన్‌కు చెందిన కొన్ని బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగాయి.