Chandrababu Stretatgy for Win: ప్రజలు.. ఓటు బ్యాంకు అనుకుంటే వాతలు పెట్టేస్తారు. జనం.. తాయిలాలకు పడిపోతారు అనుకుంటే పడేసి కుమ్మేస్తారు.. ఓటర్లేగా.. వాగ్దానాలు చాలులే అనుకుంటే వాయించి పడేస్తారు. అవును.. వీటన్నిటినీ ఊకుమ్మడిగా రుచి చూపించారు ఏపీ ప్రజలు. అధికార వైసీపీని చావుదెబ్బ కొట్టేశారు. కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కితే చాలు అనుకునే పరిస్థితి తీసుకువచ్చేశారు. ఐదేళ్ల పాటు గుంభనంగా అన్నీ భరించిన ఓటర్లు.. సరిగ్గా తమ సమయం రాగానే ఓట్లతో చావు డప్పు మోగించేశారు. నిశ్శబ్దం బద్దలు అవడం అంటే ఏమిటో వైసీపీ నేతలకు స్పష్టంగా అర్ధం అయ్యేలా చేశారు.
Chandrababu Stretatgy for Win: ఇంతకీ ఇంత ఘన విజయం టీడీపీ కూటమి సాధించడానికి కారణాలేమిటి? కర్ణుడి చావుకు కారణాలు ఎన్ని ఉన్నాయో.. వైసీపీ ఓటమికి అంతకంటే ఎక్కువ ఉన్నాయి. తప్పు మీద తప్పు.. చేస్తూనే పోయిన వైసీపీ అధినాయకుడు.. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన విధంగా పాలనను తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితం చేసేయడం.. బటన్ నొక్కితే చాలు ప్రజలు తాము చెప్పినట్టు ఆడేస్తారు అనే భ్రమలో పడిపోవడం.. చట్టాలపై ఏమాత్రం గౌరవం చూపించని వైనం.. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా చేశాయి. అయితే, ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది.. ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చూపిన రాజకీయ చతురత. ఇంతటి ఘన విజయానికి టీడీపీకి కలిసి వచ్చిన అంశాలు ఏమిటి? చంద్రబాబు నాయుడు ఎలా ప్రజల విశ్వసనీయత పొందగలిగారు? అందుకు కలిసి వచ్చిన అంశాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం.
పవన్ ఫ్యాక్టర్..
Chandrababu Stretatgy for Win: ఈరోజు టీడీపీ ఇంతటి విజయానికి చేరువైందంటే దాని వెనుక జనసేనాని పవన్ కళ్యాణ్ పట్టుదల చాలా ఉందని చెప్పాలి. మొదటి నుంచి బీజేపీతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అంటూ శపథం చేసి ఆ దిశలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కోసం ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలలో తాను కాస్త తగ్గారు. సొంత పార్టీలో ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు సకాలంలో పవన్ కళ్యాణ్ పట్టుదలను అర్ధం చేసుకుని.. టీడీపీ నాయకుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ పొత్తుకోసం ముందుకు కదిలారు. పవన్ కళ్యాణ్ ప్రజాకర్షణ.. చంద్రబాబు రాజకీయ చతురత.. ఎన్నికల ప్రచారం కోసం చేసిన ప్రణాళికలు.. విజయం దిశగా కూటమిని ముందుకు తీసుకువెళ్లాయనడంలో సందేహ లేదు.
కూటమి గెలిస్తేనే అభివృద్ధి.. ఉపాధి..
Chandrababu Stretatgy for Win: తెలుగుదేశం కూటమి గెలిస్తేనే ఉపాధి, అభివృద్ధి సాధ్యం అని ప్రజలకు చెప్పడంలో.. వారికీ ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధం అయ్యేలా చేయడంలో చంద్రబాబు విజయం సాధించారు. సంక్షేమం ఒక్కటే రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రజలకు సరిపోదనీ.. అభివృద్ధి లేకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయని ప్రజలకు నచ్చ చెప్పడంలో చంద్రబాబు సఫలం అయ్యారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
భూముల పత్రాలపై వైఎస్ జగన్ వేసుకున్న బొమ్మలు చూసి భయపడిన ప్రజలకు.. స్పష్టంగా తాము గెలిస్తే.. మీ భూములపై హక్కులు మీకే కల్పిస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తానని ప్రకటించడం ప్రజల్లో విశ్వసాన్ని నింపింది.
రాజధాని..
చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా పునాదులు వేసి.. దానికోసం ప్రయత్నాలు చేయడం చేశారు. ఈ విషయంలో మొదటి నుంచి చంద్రబాబు మాటమీద నిలబడ్డారు. అయితే, జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ ప్రకటించి.. రాజధాని లేని రాజ్యంగా ఏపీని నిలబెట్టారు. దీంతో తాము అధికారంలోకి వస్తేనే హైదరాబాద్ స్థాయి రాజధానిని నిర్మిస్తామన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయిడు.
బీజేపీతో పొత్తు..
చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ చొరవతో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం చంద్రబాబు నాయుడుకు బాగా కలిసి వచ్చింది. వ్యూహాత్మకంగా చంద్రబాబు చేసిన ఈ పని ఆయనకు అఖండ విజయాన్ని తెచ్చింది.
అభ్యర్థులు.. ప్రచారం..
అభ్యర్థుల ఎంపికలో ఆచి, తూచి వ్యవహరించడం.. ఒత్తిడులకు తలఒగ్గకుండా వ్యవహరించడమూ చంద్రబాబు రాజకీయ పరిణితికి అద్దం పట్టింది. అసంతృప్తులను సరైన సమయంలో బుజ్జగించడం ద్వారా ఎక్కడా కూడా వ్యతిరేకత రాకుండా.. ఓట్ ట్రాన్స్ ఫర్ జరిగేలా చూసుకున్నారు. ఇక ప్రచారంలో కూడా దూకుడుగా రాష్ట్రాన్ని బస్సులో చుట్టేశారు. మరోవైపు లోకేష్ యువగళం పేరుతొ ప్రజల్లో మమేకమైపోయారు. ఇవన్నీ ఇప్పుడు అఖండ విజయాన్ని సాధించి పెట్టాయి.