Credit Card: క్రెడిట్ కార్డ్ జాగ్రత్తగా వాడకపోతే కష్టాలు తప్పవు.. ఎందుకంటే.. క్రెడిట్ కార్డును ఇటీవల చాలామంది ఉపయోగిస్తున్నారు. దీని వలన కష్టాల్లోనూ పడిపోతున్నారు. అవగాహన లేకపోవడంతో బిల్లు సమయానికి కట్టక.. దానిపై వడ్డీలు పెరిగిపోయి మొత్తం బాకీ తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. క్రెడిట్ కార్డు గురించి ఈ ఆర్టికల్ ద్వారా అర్ధం చేసుకోవచ్చు By KVD Varma 18 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Credit Card: క్రెడిట్ కార్డ్ జాగ్రత్తగా వాడుకుంటే ఆపదలో ఆదుకునే స్నేహితుడు లాంటింది. అదుపు తప్పి వినియోగిస్తే ప్రాణంతక పందెంలా శత్రువుగా మారిపోతుంది. సాధారణంగా మనలో చాలామంది క్రెడిట్ కార్డు చేతిలో ఉంటే ఆర్థిక క్రమశిక్షణ తప్పుతారు. అలాగే క్రెడిట్ కార్డు బిల్లింగ్ విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో తక్కువ వాడినా.. ఎక్కువ బిల్లు కట్టే పరిస్థితి తెచ్చుకుంటారు. క్రెడిట్ కార్డు తీసుకోవాలని కంపెనీలు లేదా బ్యాంకులు మెసేజ్ లతో మన ముందు క్యూ కడతాయి. వాటికి చూసి టెంప్ట్ అయి.. ఒక కార్డు ఉంటె అత్యవసరం ఉపయోగపడుతుంది అని తీసుకుంటాం. కానీ, క్రెడిట్ కార్డు(Credit Card) మన దగ్గర ఉంటే, ఖర్చులను అదుపు చేసుకోలేక.. తరువాత బిల్లు తడిసి మోపెడు అయి.. దానిని కట్టడానికి అప్పులు చేసి.. మన బడ్జెట్ తల్లకిందులు అయి.. క్రెడిట్ కార్డు బిల్లు కొండలా పేరుకుపోతుంటే.. మినిమమ్ బ్యాలెన్స్ కూడా కట్టలేని పరిస్థితిలో పడిపోతాం. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. క్రెడిట్ కార్డు తీసుకోమని మన వెనుక పడిన బ్యాంకుల ఏజెంట్లు మన ఇంటిపై దాడికి దిగుతారు. వాళ్లకి అది అవసరం. వసూలు చేసుకోవాలి కదా. క్రెడిట్ కార్డు లేదా పర్సనల్ లోన్స్ వంటివి సక్రమంగా చెల్లిస్తున్నంత వరకూ మనం రాజల్లా బతుకుతాం. ఎప్పుడైనా.. ఏదైనా అవాంతరం వచ్చి ఒక్క నెల పేమెంట్ ఆగింది అంటే.. ఆ పెండింగ్ పేమెంట్ పై వేసే వడ్డీలు, అదనపు ఛార్జీలు..వీటిపై వేసే టాక్స్ లు.. అన్నీ కలుపుకుంటే తరువాతి నెలకు డబుల్ పేమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిలో బ్యాంకుల ఏజెంట్స్ మనల్ని ఒత్తిడి చేయడం సహజంగానే జరుగుతుంది. అప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఇలా కీసరలో దంపతుల్లా ప్రాణాలను తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకూడదు అంటే, క్రెడిట్ కార్డు అంటే ఏమిటి? దానిని తీసుకుంటే ఎలా వ్యవహరించాలి? పేమెంట్స్ ఎలా చేయాలి? బిల్లు జాగ్రత్తగా పే చేయడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇటువంటి విషయాలను అర్ధం చేసుకుందాం. క్రెడిట్ కార్డు అంటే.. క్రెడిట్ కార్డు(Credit Card) అనేది బ్యాంకు లేదా ఏదైనా ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థ మనకు ఇచ్చే స్వల్పకాలిక పర్సనల్ లోన్ వంటిది. ఉదాహరణకు మీకు లక్ష రూపాయల క్రెడిట్ కార్డు బ్యాంక్ ఇచ్చింది అనుకుందాం. అంటే లక్ష రూపాయలు మీకు అప్పు ఇచ్చిందని అర్ధం. అయితే, ఈ అప్పును మీకు అవసరం అయినప్పుడు.. అవసరమైనంత వాడుకోవచ్చు. అదే పర్సనల్ లోన లక్ష రూపాయలు తీసుకుంటే ఒకేసారి మీకు డబ్బు చేతికి వచ్చేస్తుంది. అక్కడ నుంచి నెల నెలా ఈఎంఐ రూపంలో డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ, క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చుపై 40 రోజుల వడ్డీ రహిత లోన్ దొరుకుతుంది. ఇంతవరకూ బాగానే ఉంటుంది. మీరు బిల్లు తేదీ లోపు డబ్బు కట్టేస్తే ఎటువంటి వడ్డీ కట్టే పని ఉండదు. కానీ, ఆలస్యం అయితే, దానిపై భారీగా వడ్డీ విధిస్తారు. ఆలస్య రుసుములు కూడా ఉంటాయి. క్రెడిట్ వినియోగరేటు.. క్రెడిట్ కార్డ్‌ని(Credit Card) ఉపయోగిస్తున్నప్పుడు మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ (CUR)పై నిఘా ఉంచడం చాలా ముఖ్యం. CUR మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మీ మొత్తం క్రెడిట్ పరిమితి శాతాన్ని సూచిస్తుంది. సాధారణంగా, CUR 30 శాతం కంటే తక్కువగా ఉండాలి. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ. 100 అనుకుందాం, అప్పుడు మీరు 30 శాతం అంటే రూ.30 మాత్రమే ఉపయోగించాలి. మీరు ఈ పరిమితిని మించి ఉంటే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినవచ్చు. మీ CUR 30 శాతానికి సమీపంలో లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే, మీ క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవడానికి మీ క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలి. బిల్లింగ్ సైకిల్.. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్‌లు 20 నుండి 50 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిని కలిగి ఉంటాయి. మీరు మీ బిల్లింగ్ సైకిల్ ప్రారంభంలో కొనుగోలు చేయడం ప్రారంభిస్తే, మీ బ్యాలెన్స్‌ను చెల్లించడానికి మీకు ఎక్కువ వడ్డీ రహిత సమయం ఉంటుంది. ఉదాహరణకు మీకు బిల్లింగ్ డేట్ 10 వ తేదీ అనుకుందాం.. అప్పుడు మీరు 11వ తేదీన క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే.. మీకు పూర్తిస్థాయిలో వడ్డీరహిత క్రెడిట్ దొరుకుతుంది. తరువాతి బిల్లింగ్ సమయం.. అది చెల్లించాల్సిన సమయం కలిపి 50 రోజుల వరకూ మీకు వడ్డీ లేకుండా ఉంటుంది. అదే మీరు 9వ తేదీన ఏదైనా కొనుగోలు చేస్తే కనుక మీరు 15 రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేయాల్సి వస్తుంది. అందుకే బిల్లింగ్ సైకిల్ ఆధారంగా మీ క్రెడిట్ కార్డు(Credit Card) వినియోగం ఉండాలి. Also Read: పేటీఎం కు భారీ ఊరట.. ఆ విషయంలో ED క్లీన్ చిట్! బిల్లు మొత్తం చెల్లించేయండి.. క్రెడిట్ కార్డు (Credit Card)బిల్లు ఎప్పుడూ మొత్తం ఒకేసారి చెల్లించేయాలి. దీనిలో మినిమమ్ బ్యాలెన్స్ ఆప్షన్ ఉంటుంది ఆ పద్ధతిలో పేమెంట్ చేస్తే భారీగా నష్టపోవడం జరుగుతుంది. ఎలా అంటే.. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు బకాయి మొత్తం రూ. 1 లక్షఅనుకుందాం. చెల్లించాల్సిన కనీస చెల్లింపు రూ. 5,000 మరియు గడువు తేదీకి ముందు మీరు చేసిన కనీస చెల్లింపు రూ. 5,000 చెల్లించారు. ఇప్పుడు మీకు తరువాతి బిల్లు కూడా సిద్ధంగా ఉంది. మీకు ప్రస్తుతం రూ. 95,000 బాకీ ఉంది. ఈ మొత్తంపై వడ్డీ నెలవారీ 3.6%. అంటే రూ.3,420 వడ్డీ చెల్లించాలి. అందువల్ల, దాని మొత్తం రూ.3,420 పెరిగి రూ.98,420కి చేరుకుంది. మళ్ళీ అందులో మీరు మినిమమ్ పేమెంట్ చేశారు అనుకుందాం.. అంటే దాదాపుగా అది మళ్ళీ 5 వేలు ఉంటుంది. మళ్ళీ మీ బకాయి వడ్డీతో కలిపి 98 వేలు అయిపోతుంది. ఇలా మీరు ప్రతినెలా మినిమమ్ బిల్లు కడుతూనే ఉంటారు. మీ అసలు బిల్లు రూపాయి కూడా తగ్గదు సరికదా.. పెరిగే అవకాశం కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం ఒకేసారి కట్టలేకపోతే.. ఇలా మీరు క్రెడిట్ కార్డు అప్పు నుంచి బయట పడటం కష్టం అయిపోతుంది. అందుకే, క్రెడిట్ కార్డు వాడిన తరువాత జాగ్రత్తగా దానిని తిరిగి చెల్లించేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు అందుకు అవసరమైనంత డబ్బు అందుబాటులో లేకపోతే, మీ బ్యాంక్ ను సంప్రదించి ఆ డబ్బు మొత్తాన్ని ఈఎంఐ లలోకి మార్చమని కోరండి. ఎందుకంటే, నెలనెలా మినిమమ్ బ్యాలెన్స్ కట్టడం వాళ్ళ అయ్యే వడ్డీల కంటే.. ఈఎంఐ విధానంలో వచ్చే వడ్డీరేటు తక్కువ ఉంటుంది. జాగ్రత్తగా కట్టుకుంటూ వెళితే బాకీ తీరిపోతుంది. ఏదిఏమైనా క్రెడిట్ కార్డును అవసరం మేరకు ఉపయోగిస్తే.. ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. Watch this Interesting Video: #credit-card-bills మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి