కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మొదట ఉదయం 8 గంటలకు చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన అంబర్‌పేట చేరుకొని పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు. తర్వాత బషీరాబాగ్ చేరుకొని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.
అనంతరం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్న కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. త్వరలో ప్రతీ గ్రామంలో బీజేపీ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తామని, సీఎం కేసీఆర్ చేస్తున్న అవినీతి పాలన గురించి గ్రామస్థాయిలో వివరిస్తామన్నారు.
అదే విధంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల రుణమాఫీల గురించి రైతులకు తెలియజేస్తామని తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ రైతు రుణమాఫీలు ఇంతవరకు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పింది ఒకటీ.. చేసేది మరోటని తీవ్రస్థాయిలో విమర్శించారు. అర్హులకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇంతవరకు పంపిణీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ నియంత పాలనను ప్రజలు గమనిస్తున్నారన్న కిషన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్‌కు బుద్ధి చెబుతారన్నారు.