'కింగ్స్‌లీ' సరస్సు నార్త్ ఈస్ట్ ఫ్లోరిడాలో దాదాపుగా 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వృత్తాకార సరస్సు, ఇది ఫ్లోరిడాలోని స్టార్క్‌కు తూర్పున 9.7 కిమీ క్లే కౌంటీ లోపల ఉంది. ట్రైల్ రిడ్జ్ నిర్మాణం అంచున ఉన్న ఈ సరస్సు ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. వేసవికాలంలో ఎలాంటి సరస్సులైనా సందర్శకులతో కిటకిటలాడుతాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం క్లే కౌంటీలో సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు అందరూ కింగ్స్‌లీ లేక్ టూర్ వేయాల్సిందే అంతలా సందర్శకులను కట్టిపడేస్తుంది.
సందర్శకులు అధిక సంఖ్యలో రావడానికి కారణం
ఫుల్ ఫన్ .. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సాగే ఈ సరస్సును చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలి రావడానికి మరో ప్రధాన కారణం ఇక్కడ ప్రకృతి రమణీయత. ఈ గుండ్రటి ఆకార సరస్సును కాస్త ఎత్తులో నుంచి చూస్తే ఈ సరస్సు ఎంత గుండ్రంగా ఉందో అర్ధమవుతుంది. అందుకే ఈ సరస్సుకు సిల్వర్ డాలర్ లేక్ అని ముద్దు పేరు పెట్టారట. ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఆ సరస్సు పైనున్న ఆకాశ మార్గం గుండా విమానాలు నడిపిన పైలట్లు. అవును... సహజసిద్ధంగా ఏర్పడిన ఈ సరస్సు పై నుంచి చూస్తే ఒక వెండి నాణెం మెరుస్తున్నట్లుగా కన్పిస్తుండటంతో పైలట్లు దీనికి ఆ పేరు పెట్టడం మరో విశేషం అనే చెప్పాలి.
కింగ్స్‌లీ సరస్సు ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
రెండు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అరుదైన సుందరమైన సరస్సు తీరం 5.5 మైళ్ల పొడవుంది. ఈ సరస్సు లో ఉత్తర, పడమర దిశల్లో కలిపి సుమారు 200 రేవులున్నాయి. కింగ్స్‌లీ లేక్ సుమారు 90 అడుగుల లోతు ఉన్నట్లు అంచనా వేస్తుండటంతో ఈ సరస్సు ఫ్లోరిడాలోనే లోతైన సరస్సుగా కూడా ప్రసిద్ధిచెందింది. సహజంగా ఏర్పడినందున ఈ సరస్సు ఫ్లోరిడాలోనే పురాతన, ఎత్తయిన సరస్సు అని స్థానికులు చెబుతున్నారు.