Telangana: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం అదే మార్గంలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు త్వరలో కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల తోపాటు భూ సమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి రోజూ వారి సమయం రిజిస్ట్రేషన్ల సేవలతోనే గడిచిపోతోంది.
పనిని విభజించి..
భూ సమస్యలు, ఇతర ప్రొటోకాల్ సేవల పరిశీలన పనులు భారంగా మారుతున్నాయి. దీంతో భూ సమస్యల పరిష్కారంలో వేగం తగ్గిపోతోంది. ఈ నేపధ్యంలోనే మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. కార్యాలయ నిర్వహణ, సమస్యల పరిష్కారం ఇతర అధికారిక విధులు, కార్యాలయ పర్యవేక్షణ అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: అమలులోకి దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు.. వివరాలివే!
డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి లాగిన్..
ఒకవేళ ఇది అమలైతే మాత్రం ఇప్పటి వరకు తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్‌ను ఇక నుండి డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తహసీల్దారు కార్యాలయాలు వేదికగా సాగు భూముల రిజిస్ట్రేషన్లను 2020 నవంబర్ నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, ఇందు కోసం ధరణి ఆపరేటర్ మినహా కొత్త సిబ్బందిని ఎవరినీ నియమించలేదు. పైగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటుతో ఉన్నవారినే వీటికి నియమించారు. దీంతో సిబ్బంది కొరత ఏర్పడింది.
కీలక సంస్కరణలు..
భూ సేవలే కాకుండా ధ్రువీకరణ పత్రాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక వంటి 36 రకాల సేవలను తహసీల్దారు కార్యాలయమే నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే రెవెన్యూశాఖ అధికారులు కీలక సంస్కరణలను తీసుకురావాలని భావిస్తోన్నారు. అయితే, ధరణి పోర్టల్ లాగిన్లను తహసీల్దార్లతోపాటు డిప్యూటీ తహసీల్దార్లకు పూర్తిస్థాయిలో ఇచ్చేముందు.. కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద నడిపించి పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అతి కొద్ది రోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.