- వందేభారత్ రైల్లో వింత ఘటన
- డోర్ లాక్ చేసి టాయిలెట్లో గంటలకొద్ది గడిపిన వ్యక్తి
- కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఘటన
- టాయిలెట్ డోరు విరగొట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు
- వ్యక్తి వివరాలను ఆరా తీస్తున్న రైల్వే అధికారులు
కేరళలోని ఉత్తర కాసర్గోడ్ జిల్లాలో వందే భారత్ రైలు ఎక్స్ప్రెస్ పరుగులు పెడుతోంది. అందులో ఓ ప్రయాణికుడు టిక్కెట్ తీసుకోలేదు. ఇంతలో టీసీ వస్తున్నాడని గమనించిన ఆ వ్యక్తి.. వెంటనే టాయిలెట్లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. టీసీకి భయపడి గంటల తరబడి అందులోనే ఉండిపోయాడు. ఎంత పిలిచినా బయటకు వచ్చేందుకు ససేమిరా అన్నాడు. ఇలా దాదాపు 275 కిలోమీటర్లు ప్రయాణించాడు.
ఇక వందేభారత్ రైలు శోర్నూర్ స్టేషన్కు చేరింది. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో ఆర్పీఎఫ్ అధికారులు వచ్చి.. టాయిలెట్ డోరు విరగొట్టారు. అందులో దాక్కున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. అతడు ఎర్రరంగు టీషర్టు వేసుకుని ఉన్నాడు. హిందీలో మాట్లాడుతున్నాడు. బిక్కుబిక్కుమంటూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. తనను కొంతమంది తరుముకొంటూ వచ్చారని, వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వందే భారత్ టైన్ ఎక్కి.. బాత్రూంలోకి దాక్కున్నట్లు చెప్పాడు. అయితే.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్.. అతడి వివరాలు, స్వస్థలం గురించి ఆరా తీస్తున్నారు. టిక్కెట్ లేకుండా వందేభారత్ ఎక్కినందుకు ఫైన్ కూడా వేశారు. ఇక.. ఆ వ్యక్తి చెబుతున్నట్లు నిజంగానే ఎవరైనా తరుముకొచ్చారా.. లేక తప్పించుకునేందుకు కట్టు కథలు చెబుతున్నాడా అన్న దానిపై ఆర్పీఎఫ్ అధికారులు విచారణ చేస్తున్నారు.