ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయవద్దని కేరళ అసెంబ్లీ కోరింది. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సభలో సీఎం పినరయి విజయన్ మంగళవారం ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యూసీసీ విషయంలో కేంద్రం ఏకపక్షంగా తొందరపాటు చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.
సంఘ్ పరివార్ ద్వారా చూపబడిన యూసీసీ రాజ్యాంగం ప్రకారం లేదన్నారు. అది హిందూ న్యాయ గ్రంథం 'మనుస్మృతి'పై ఆధారపడి ఉందని వాదనలు వినిపించారు. దాన్ని సంఘ్ పరివార్ చాలా కాలం క్రితమే స్పష్టం చేసిందన్నారు. రాజ్యాంగంలో ఉన్న వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించడం లేదన్నారు. అలాగని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం పర్సనల్ లాలోని విడాకుల చట్టాలను మాత్రమే నేరంగా పరిగణించిందని చెప్పారు. అయితే మహిళల భద్రత, అణగారిన వర్గాల సంక్షేమానికి బీజేపీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. సీఎం పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన వెంటనే సభలో చర్చ జరిగింది. చట్టంలో తీసుకు రావాల్సిన మార్పుల గురించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పలు సూచనలు చేసింది.
యూడీఎఫ్ సభ్యులు చేసిన సూచనలు, సలహాలను తీర్మానంలో పొందు పరిచారు. అనంతరం తుది తీర్మానాన్ని సీఎం పినరయి చదివి వినిపించారు. దేశ లౌకిక లక్షణాన్ని దూరం చేసే ఏకపక్ష, తొందరపాటు నిర్ణయమని అన్నారు. యూసీసీని విధించే కేంద్ర చర్యలపై రాష్ట్ర అసెంబ్లీ ఆందోళన చెందుతోందన్నారు. కేంద్ర చర్యలు విస్మయానికి గురిచేస్తోందన్నారు.