ఫొటోలు, వీడియోలు నిషేధం..
ఇటీవల ఓ మహిళ కేదార్‌నాథ్ ఆలయం ముందు తన తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై హిందూ సంఘాలతో పాటు భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. దాంతో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇక నుంచి ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీయకుండా నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేసింది.
సంప్రదాయ దుస్తులతోనే ఆలయానికి రావాలి..
ఆలయ ప్రాంగణంలోకి మొబైల్స్, కెమెరాలతో ప్రవేశించకూడదని.. లోపల ఎలాంటి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుమతించబడదని తెలిపింది. మీరు సీసీటీవీ ప్రాంగణంలో ఉన్నారని హెచ్చరించే బోర్డులను టెంపుల్ పరిసరాల్లో ఉంచింది. అలాగే ఆలయ ప్రాంగణంలో టెంట్ లేదా క్యాంపు ఏర్పాటు చేయడం కూడా నేరమని ప్రకటించింది. ఇక కేదార్‌థామ్‌కు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు వేసుకుని రావాలని.. అలాంటి వారికి మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర సూచించారు. ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ రూల్స్ తీసుకువచ్చామని తెలిపారు.
కమిటీ నిర్ణయంపై భక్తులు హర్షం..
కొంతకాలంగా కేదార్‌నాథ్ ఆలయ ప్రారంగణంలో భక్తులు దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై భక్తుల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ప్రదేశంలో ఇలాంటి చర్యలు ఏంటని మండిపడ్డారు. ఫిర్యాదుల నేపథ్యంలో ఆలయ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా రీల్స్ చేయడం కానీ, ఫొటోలు తీయడం కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దేశంలోని మిగతా ఆలయాల్లో కూడా ఇటువంటి రూల్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.