Indipendence Day at Golkonda kota: గోల్కొండ కోటలో అట్టహాసంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి భారత దేశ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడిచిందని.. అహింసా మార్గంలోనే స్వరాష్రాన్ని సాధించుకున్నామన్నారు.
పూర్తిగా చదవండి..
అయితే గత పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయిందని..అదే విధంగా గత ప్రభుత్వాల తీరుతో అన్నదాతల జీవితాలు బలైపోయాయని కేసీఆర్ అన్నారు. ఇక గతంలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు..ఆత్మహత్యలే ఉండేవన్నారు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించామన్నారు. ఒకప్పుడు రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన దుస్థితి ఉండేదని కేసీఆర్ గుర్తుచేశారు.
అయితే అనతి కాలంలోనే తెలంగాణ తిరుగులేని విజయాలను సాధించిందని.. తెలంగాణ నేడు ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందనే పేరు తెచ్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో నేడు నిరంతరం విద్యుత్ ప్రసారంతో తెలంగాణ వెలిగిపోతుందన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ సర్కార్ ప్రజల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా పని చేస్తూ వస్తుందన్నారు. ఒకప్పుడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణలో నేడు జలధారులు పారుతున్నాయన్నారు. దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నా.. పాలకుల అసమర్థత కారణంగా వాటిని సంపూర్ణంగా వినియోగించుకోలేక పోతున్నారన్నారు. 75 ఏళ్ళ ప్రగతి లో ఇంకా ఎంతో సాధించాల్సి ఉందన్నారు.
తాగునీటి అవసరాల కోసం రాబోయే కొద్ది రోజుల్లోనే జలశయాలకు నీటి ఎత్తిపోతల ప్రారంభిస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్ద అవరోధం తొలగిపోయిందన్నారు. సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని..అతి త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.పాలమూరు రంగారెడ్డి జిల్లాలో పచ్చని పంటలు వస్తాయన్నారు. సాగునీటి రంగంలో స్వర్ణయుగం సృష్టించామన్నారు కేసీఆర్. కొందరు అల్పబుద్ధితో రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారని.. సాగుకు 3 గంటల విద్యుత్ చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వారి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగిన జవాబు చెబుతారన్నారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకునేందుకు విపక్షాలు యత్నించాయన్నారు.
ఎన్జీటీలో కేసులు వేసి వికృత మనస్తత్వం బయట పెట్టుకున్నారని.. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయన్నారు. చేనేత కార్మికుల కోసం మరో కొత్త పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. చేనేత గుంటమగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామన్నారు. ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ చూసి కొందరు ఆందోళన చెందుతున్నారన్నారు. సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకునేందుకు విఫల ప్రయత్నాలు చేశాయని.. ఆ శక్తుల ప్రయత్నాలను వమ్ము చేస్తూ ఆర్టీసీ బిల్లును ఆమోదించామన్నారు.
ఆర్టీసీ బిల్లు ఆమోదంతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండిందన్నారు. రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇలాగే అందించాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ వన్ అన్నారు. గత నెలలో అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టిందన్నారు.తక్షణ సహాయ చర్యలకు 500 కోట్లు విడుదల చేశామన్నారు. ఈ సారి వరి సాగు రికార్డు స్థాయిలో ఉంటుందన్నారు. రెండు దశల్లో రైతులకు దాదాపు 37 వేల కోట్ల పంట రుణాలు మాఫీ అని.. దేశంలో రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు కేసీఆర్.
త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి ఉద్యోగుల వేతనాలు పెంచుతామన్నారు. అప్పటి వరకు మధ్యంతర భృతి చెల్లిస్తామని ప్రకటించారు ఆయన. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ గా వెయ్యి కోట్లు పంపిణీ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. వచ్చే 3,4 ఏళ్లలో మెట్రో విస్తరణ పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్ 415 కిలోమీటర్లకు మెట్రో సౌకర్యం విస్తరిస్తుందన్నారు. 2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయన్నారు. పారిశ్రామిక రంగంలో గత తొమ్మిదిన్నరేళ్లలో 17.21 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. ఇక ఉత్తమ సేవలు అందించిన 14 మంది అధికారులు, సిబ్బంది సీఎం చేతుల మీదుగా అవార్డులందుకున్నారు.
[vuukle]