ఎవరు ఎవరికి బీ టీమ్.. కేసీఆర్ కౌంటర్ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాము ఎవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీలకు బీ టీమ్ కాదని చెప్పారు. తమది రైతులు, కార్మికులు, పేదల టీమ్ అని స్పష్టం చేశారు. By Trinath 27 Jun 2023 in నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి మహారాష్ట్రలో కూడా పాగా వేయాలని సీఎం కేసీఆర్ అనేక ప్రయత్నాల్లో ఉన్నారు. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి.. ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్స్ లో ఉన్నారు. ఈక్రమంలోనే మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఆయన.. తరచూ ఆ రాష్ట్రానికి వెళ్లి వస్తున్నారు. ఓవైపు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూనే.. హిందుత్వంతో ముడిపడిన మహారాష్ట్ర పాలిటిక్స్ లో తనదైన మార్క్ వేసేలా ఆలయాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. తాజాగా రెండు రోజుల పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. శ్రీవిఠల్ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించారు. శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. అర్చకులు కేసీఆర్ మెడలో తులసి మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు. శ్రీవిఠలేశ్వర స్వామి, రుక్మిణీ అమ్మవార్లతో కూడిన ప్రతిమను బహూకరించారు. ఆ తర్వాత సీఎం అక్కడి నుంచి సర్కోలీ గ్రామానికి వెళ్లారు. షోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ భారీ బహరింగసభను నిర్వహించింది. కేసీఆర్ ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే బీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఆయనతోపాటు పెద్ద సంఖ్యలో చిన్న, పెద్ద నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు. వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న పార్టీని చూసుకుని జాతీయ పార్టీలు ఎందుకు జడుసుకుంటున్నాయని విమర్శించారు కేసీఆర్. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మహారాష్ట్రలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తాము ఎవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీలకు బీ టీమ్ కాదని చెప్పారు. తమది రైతులు, కార్మికులు, పేదల టీమ్ అని స్పష్టం చేశారు. భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయిందని.. ఇప్పుడు భారత్ అభివృద్ధి ఎలా ఉందో ఆలోచించాలని పేర్కొన్నారు. మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. భారత్ సరికొత్త పంథాలో నడవాల్సి ఉందని స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా.. మేకిన్ ఇండియా అని కొందరు గొప్పలు చెబుతున్నారని కేసీఆర్ విమర్శించారు. కానీ చాలాచోట్ల చైనా బజార్లు దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. భారత్ బజార్లు ఎక్కడికి పోయాయని నిలదీశారు. తాను రైతు బిడ్డను అయినందునే వారి బాధలు తెలుసన్న కేసీఆర్.. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా భూమి మార్పిడి హక్కులు రైతులకే ఇచ్చామన్నారు. అన్నదాతలు స్వతహాగా మార్చుకుంటేనే భూములు మారతాయని.. సీఎంతో పాటు నాయకులు, అధికారులెవరూ మార్చలేరని తెలిపారు. తాము చేస్తున్న యుద్ధంలో న్యాయం ఉన్నందున కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై ఉద్ధవ్ శివసేన వర్గం ఘాటుగా స్పందించింది. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏమాత్రం ఉండదని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అంతేకాదు, కేసీఆర్ ఇలానే చేస్తే.. తెలంగాణలోనూ అధికారం కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కేవలం ఓటమి భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు పదేపదే వస్తున్నారని మండిపడ్డారు. 12 నుంచి 13 మంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు మాత్రమేనని.. బీఆర్ఎస్, బీజేపీకి బీ టీమ్ గా మారిందని విమర్శలు గుప్పించారు. బీజేపీనే కేసీఆర్ ను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ బలంగా ఉందని స్పష్టంచేశారు సంజయ్ రౌత్. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సంజయ్ రౌత్ కు కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి మహా వికాస్ అఘాడీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాయి. ఉద్ధవ్ థాక్రే సీఎం అయ్యారు. అయితే.. శివసేన రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఉద్ధవ్ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనూహ్యంగా శివసేన రెండో వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగిస్తోంది. షిండేను సీఎం చేసి బీజేపీ డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకుంది. అయితే.. ఇదంతా ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తూ వస్తోంది. బీజేపీ, ఉద్ధవ్ శివసేన వర్గం మధ్య యుద్ధం సాగుతుండగా.. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో విస్తరించే పనిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు మహారాష్ట్రను నాశనం చేశాయని విమర్శలు గుప్పిస్తున్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్నా ప్రజలకు అందడం లేదని.. తెలంగాణ మోడల్ ను అక్కడి ప్రజలకు వివరిస్తున్నారు. అయితే.. కేసీఆర్ వెనుక కూడా బీజేపీ ఉందనేది ఉద్ధవ్ శివసేన రెండో వర్గం వాదన. బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి