Warangal BRS MP Candidate: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై సస్పెన్స్ వీడింది. ఈరోజు వరంగల్ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశం అయిన కేసీఆర్.. ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్ గా సుధీర్ కుమార్ ఉన్నారు. సుధీర్ కుమార్‌ది మాదిగ సామాజికవర్గం. 2001 నుంచి పార్టీకి విధేయుడిగా ఆయన ఉన్నారు. ఇది వరకే వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ప్రకటించారు. అయితే.. ఇటీవల కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ లో ఎంపీ అభ్యర్థి కొరత ఏర్పడింది. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. బీజేపీ నుంచి ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీ ఎన్నికల బరిలో ఉన్నారు.
రాజయ్యకు మొండిచేయి..
ఈరోజు వరంగల్ నేతలతో సమావేశమైన కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కూడా ఆహ్వానించారు. అయితే... ఈసారి తనకు కేసీఆర్ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని ఆశగా ఫామ్ హౌస్ వెళ్లిన రాజయ్యకు నిరాశే మిగిలింది. ఎంపీ టికెట్ రాజయ్యకు ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాటికొండ రాజయ్యను పక్కకు పెట్టి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ ను కడియం శ్రీహరికి ఇచ్చారు కేసీఆర్. దీంతో భంగపడ్డ తాటికొండ రాజయ్య.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన కలిశారు. అందరు ఆయన కాంగ్రెస్ లో చేరుతారని అనుకున్నారు. కానీ.. తనకు రాజకీయంగా భద్ర శత్రువుగా ఉన్న కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంతో యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కడియం బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో కేటీఆర్ తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలని రాజయ్యను ఆహ్వానించారు. కాగా కేటీఆర్ హామీ.. కేసీఆర్ పిలుపు మేరకు ఈరోజు జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు. ఎంపీ టికెట్ వస్తుందని అనుకున్న రాజయ్యకు చివరికి నిరాశే మిగిలింది.