కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపండి.. ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయ్యండి- కేసీఆర్

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపండంటూ ఫైర్ అయ్యారు కేసీఆర్‌. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దన్నారు. మన కర్మ డిసైడ్‌ అయ్యేది మనం వేసే ఓటుతోనేనని చెప్పారు. భువనగిరి, జనగామ ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

New Update
కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపండి.. ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయ్యండి- కేసీఆర్

ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌. ఆదివారం బీఆర్ఎస్‌ మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం హుస్నాబాద్‌ వేదికగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన గులాబీ బాస్‌.. సోమవారం జనగామ, భువనగిరి సభలతో హోరెత్తించారు. రెండు సభల్లోనూ బీఆర్ఎస్‌ ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తూనే.. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికలప్పుడు వచ్చి ఆగమాగం చేసేవారిని, ఆపద మొక్కులు మొక్కే వారిని నమ్మొద్దన్న కేసీఆర్‌.. రానున్న ఐదేళ్లలో మన కర్మను నిర్ణయించేది మన ఓటేనని, మంచి చెడులను గుర్తెరిగి ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

జనగామను వంద శాతం అభివృద్ధి చేస్తాం..
''నాకు రైతుల కష్టాలు తెలుసు. అందుకే రెవెన్యూ అధికారుల చేతిలో ఉండే అధికారాలను రైతుల చేతిలో పెట్టాను. రైతు వేలిముద్ర ఉంటే తప్ప భూమి జోలికి ఇంకెవరూ పోకూడదనే ధరణి పోర్టల్ తీసుకువచ్చాం. అటువంటి ధరణి పోర్టల్‌ను తీసేసి బంగాళాఖాతంలో వేయాలని విపక్షాలు అంటున్నాయ్‌. రైతుల మీద మళ్లీ అధికారులను రుద్దాలని ఆలోచిస్తున్నాయి. ధరణి పోర్టల్‌ వద్దంటున్న, వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ నేతలను బంగాళాఖాతంలో కలపండి. తెలంగాణ రాష్ట్రం సాకారం కాకముందు కొన్ని జిల్లాలకు వెళితే కళ్ల వెంట నీళ్లు తిరిగేవి. రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదు. కరెంట్‌ కష్టాలు లేవు. నీటి కొరత లేదు. పంటలు బాగా పండుతున్నాయి. ఎక్కడ కరువు వచ్చినా.. జనగామలో మాత్రం రాదు. రాష్ట్రం ఏర్పడ్డాక.. భువనగిరి, జనగామలు గ్రోత్‌కారిడార్లు అయ్యాయి. దేవాదుల, కాళేశ్వరం నుంచి నీళ్లు రాబోతున్నాయి. వందకు వంద శాతం జనగామ అభివృద్ధి జరిగి తీరుతుంది. జనగామలో ఏం జరగాలనుకున్నామో.. అవన్నీ జరుగుతాయి. ఎన్నికలప్పుడు వచ్చి కొందరు ఆపద మొక్కులు మొక్కుతుంటారు. అలాంటి వాళ్లను నమ్మొద్దు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ఓట్ల కోసం కాదు. అబద్ధాల మేనిఫెస్టో పెట్టాల్సిన అవసరం బీఆర్ఎస్‌కు లేదు. తెలంగాణలో పరిస్థితులు మెరుగుపడడంతో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. రాష్ట్రంలో సకల వర్ణాల ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో మతాల పేరిట చిచ్చు పెట్టే వారికి ఏ కొంచం కూడా అవకాశం ఇవ్వొద్దు'' అంటూ జనగామ సభకు విచ్చేసిన ప్రజల్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

భువనగిరికి ఐటీ పార్కులు తీసుకొస్తాం..
''గత కాంగ్రెస్‌ ప్రభుత్వం భువనగిరిలో అరాచక శక్తులకు అండగా నిలిచింది. కాంగ్రెస్‌ పెంచి పోషించిన అరాచక, కిరాతక మూకలను ఏ విధంగా బీఆర్ఎస్ ఏరిపారేసిందో మీ అందరికీ తెలుసు. ఈ రోజు భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దని, మంచి చెడు ఆలోచించి ఓటు వేయండి. ఉద్వేగంలో కొట్టుకొనిపోయి ఓటేస్తే మన జీవితాలు తల్లకిందులవుతాయి. పైళ్ల శేఖర్ రెడ్డిని మరోసారి గెలిపించండి. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే భువనగిరిలో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తాం.'' అంటూ భువనగిరి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రజల్ని కోరారు.
---------------------------------------------
జనగామ, భువనగిరి సభల విశేషాలు
- జనగామలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు సుమారు 70 వేల మంది ప్రజలు హాజరయ్యారు.
- భారీ ఎత్తున సీఎం కేసీఆర్‌, జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కటౌట్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు
- సభా వేదికపై కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల
- జనగామ సభ తర్వాత భువనగిరి సభకు హాజరైన సీఎం కేసీఆర్
- బోనాలు, బతుకమ్మలు, బైక్‌ ర్యాలీలతో.. కేసీఆర్‌కు భువనగిరి బీఆర్ఎస్‌ శ్రేణుల ఘన స్వాగతం
-----------------------------------------------

Advertisment
తాజా కథనాలు