మీరు మార్కెట్ నుంచి కూరగాయలు మోసుకుంటూ ఇంటికి వెళ్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వెనుకే ఎవరైనా అనుమానంగా కనిపిస్తే జాగ్రత్త పడండి. మీ దగ్గరున్న విలువైన వస్తువులు మాయం కావొచ్చు.. కరోనా మాస్క్ ముసుగులో చోరీగాళ్లు మీ వెనుకే రావచ్చు..! అదేంటి.. కూరగాయల మార్కెట్ నుంచి వెళ్తుంటే దొంగలేందుకు వస్తారు..? పైగా నా మెడలో గోల్డ్ చైన్ కూడా లేదే అని ఆలోచిస్తున్నారా..? ప్రతిసారి గోల్డ్ చైనే కొట్టాయాలని దొంగల రాజ్యాంగంలో రాసిలేదు. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎప్పుడు ఏది మార్కెట్‌లో డిమాండ్‌లో ఉంటుందో దాన్ని చోరీ చేయడం.. సొమ్ము చేసుకోవడం దొంగల నైజం. అందుకే ఇప్పుడా కళ్లు మీ కూరగాయల బ్యాగ్‌పైనే ఉండొచ్చు..ఎందుకుంటే చాలా ప్రాంతాల్లోకి ఇప్పుడు టమాటా దొంగలు వచ్చేశారు. మార్కెట్లు, కూరగాయల దుకాణాల్లో టమాటాలను చోరీ చేస్తున్నారు. కొన్ని చోట్లా ఏకంగా టమాటాలు పండించే తోటల్లోకే ప్రవేశిస్తున్నారు. అందుకే బీ అలర్ట్..! ఏంటి నమ్మడం లేదా..? అయితే మహబూబాబాద్ జిల్లాలో ఏం జరిగిందో తెలుసుకోండి.. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి..
టమాటా బాక్సులే లేపేశారు:
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణం గాంధీ సెంటర్‌లోని ఓ కూరగాయల మార్కెట్ ఉంది. రోజు లానే ఉదయాన్నే రావడం..రాత్రి వరకు కూరగాయలు అమ్మడం..తిరిగి ఉదయాన్నే మళ్లీ రావడం షరా మాములే. ఇంటికి వెళ్లేటప్పుడు కూరగాయల షాప్‌కి రక్షణగా టెంట్‌తో కప్పేస్తారు. ఆ కూరగాయలు ఎవరూ దొంగతనం చేస్తారులే అని పెద్దగా పట్టించుకోరు. అదే వాళ్ల కొంపముంచింది. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా, మిర్చి ధరలు చుక్కలను తాకుతున్నాయి. దొంగలకు ఈ టమాటాలే వజ్రాల్లా కనిపించాయి. పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఓ ట్రాలీని తీసుకొచ్చారు. నైట్ వచ్చి కామ్‌గా టెంట్ లేపేశారు. అందులోని టమాటా, మిర్చి బాక్సులను ట్రాలీలో పట్టుకుపోయారు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉదయం రాగానే తన షాప్ చూసిన వ్యాపారికి ఏం జరిగిందో అర్థంకాలేదు. దుకాణమంతా గందరగోళంగా కనిపించింది. తర్వాత టమాటా,మిర్చి బాక్సులు మిసైనట్టు అర్థమైంది. లబోదిబోమంటూ పోలీసుల స్టేషన్‌కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు.
2.5లక్షల విలువ చేసే టమాటా చోరీ:
కూరగాయల షాప్‌లో నుంచి టమాటా ఎత్తుకెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది సోషల్‌మీడియా అవ్వగా.. కర్ణాటకలో జరిగిన ఘటన టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది. కర్ణాటక హసన్ జిల్లా బేలూరు తాలూకా గోణి సోమనహళ్లి గ్రామంలో టమాటా పంటను దొంగలు చోరీ చేశారు. ఏకంగా రూ.2.5లక్షల విలువైన టమాటాను దొంగిలించారు. రాత్రిపూట ఎవరూ లేని సమయంలో సైలెంట్‌గా సంచులతో ఎంట్రీ ఇచ్చిన చోరీగాళ్లు.. 60బ్యాగుల్లో టమాటాలను పట్టుకుపోయారు. ఉదయం లేచి రైతు పొలంలోకి వెళ్లి చూడగా టమాటాలు కనిపించలేదు. ఒక్కసారిగా షాకైన తోట యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీకెమెరాలతో నిఘా:
దొంగల పనిపట్టేందుకు.. విలువైన వస్తువులను, బంగారాన్ని, డబ్బులను కాపాడేందుకు సాధారణంగా చాలామంది ఇళ్లలోనో, తమ షాపుల్లోనో సీసీకెమెరాలు పెడుతుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆ విలువైన వాటి జాబితాల్లో కూరగాయలు కూడా చేరిపోయాయి. కర్ణాటక హావేరి జిల్లా హానగల్ తాలూకా అక్కి ఆలూరు గ్రామంలో మల్లప్ప అనే రైతు తన టమాటా తోటకు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. బేలూరులో జరిగిన ఘటన తర్వాత అటు చాలా మంది తమ టమాటా తోటలకు సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారట..! నిజానికి గతంలో ఉల్లిపాయల ధరలు పెరిగిన సమయంలోనూ దొంగలు చేతివాటం చూపించారు. బాక్సులకు బాక్సులు ఆటోల్లో ఉల్లిపాయలను ఎత్తుకుపోయారు. ఇప్పుడు టమాటా వంతు వచ్చింది.. మరి తర్వాత దొంగల టార్గెట్ ఏం అవుతుందో ప్రభుత్వానికి తెలియాలి..!