kamareddy Marriage Incident:పెళ్ళిపీటలు ఎక్కాల్సిన పెళ్లి కొడుకు శవమై కనిపించాడు. కామారెడ్డి జిల్లా(kamareddy) ఎల్లారెడ్డిలో పెళ్లి సందడితో కళకళలాడుతున్న ఇంటిని ఒక్కసారిగా విషాదం కమ్మెసింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మోసర్ల రాజేందర్(25) స్థానికంగా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇతనికి రెండు నెలల కింద నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతితో పెండ్లి ఫిక్స్ అయింది. కుటుంబ సభ్యులంతా పెండ్లి పనుల్లో నిమగ్నమై శుభలేఖలు ప్రింట్ చేయించారు.
బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేయాలనుకుంది ఆ కుటుంబం. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటిని అందంగా అలంకరించారు. బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు కూడా పంచిపెట్టారు.ఈ నెల 3వ తేదీన తన అన్న శ్యామ్‌తో కలిసి రాజేందర్ బంధువులకు పెళ్లి పత్రికలు పంచి వచ్చారు. అదేరోజు సాయంత్రం బైక్ పై ఊర్లోకి వెళ్లొస్తానని చెప్పి బయలుదేరిన రాజేందర్ అర్ధరాత్రికి కూడా తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గురువారం లింగంపేట మండలం ముస్తాపూర్శివారులోని కొత్తచెరువు కట్ట కింద ఉన్న చెట్టుకు కుళ్లిపోయిన స్థితిలో ఓ శవం వేలాడుతున్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి చూశారు. కాసేపట్లో పెళ్ళి ఉందన్న సమయంలో విషాదకరమైన విషయం తెలిసింది. అక్కడి ఆనవాళ్ల ప్రకారం మృతుడు రాజేందర్ గా గుర్తించారు. పెళ్ళిపీటలు ఎక్కాల్సిన పెళ్లి కొడుకు శవమై కనిపించాడు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్సై ప్రకాశ్‌జాదవ్ తెలిపారు.
ఘనమైన ఏర్పాట్లతో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుందని కలలు కన్నపెళ్లి కూతురు ఆశలు ఆవిరి అయ్యాయి. తాళి కట్టాల్సిన పెళ్లి కుమారుడు అనంత లోకాలకు వెళ్లిపోవ్వడంతో పెళ్లి కూమార్తె శోకసంద్రంలోకి వెళ్లి పోయింది. పెద్దల సందడి, పిల్లల కేరింతలు, బాజాభజంత్రీలతో ఎంతో సంబరంగా కనిపించిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఘోరం చోటుచేసుకోవడంతో రెండు కుటుంబాలను తీవ్ర విషాదం ముంచేసింది.రాజేందర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also read: 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి బస్‌లో మంటలు.. టైర్ పేలడంతో ప్రమాదం!