తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ రైలు.. ఈ నెల 6న ప్రారంభం

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు మరో వందే భారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ మధ్య నడవనున్న రైలు ఇప్పటికే ట్రయల్ రైన్ పూర్తిచేసుకుంది. ప్రధాని మోదీ వర్చువల్‌ పద్ధతిలో ఈ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు.

New Update
తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ రైలు.. ఈ నెల 6న ప్రారంభం

ప్రధాని మోదీ చేత ప్రారంభం.. 

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ మరో శుభవార్త తెలిపింది. ఇప్పటికే ప్రజల ఆదరణ పొందిన వందేభారత్ రైలును మరో కీలక మార్గంలో కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ మధ్య నడవనున్న ఈ రైలుకు ఇప్పటికే ట్రయల్‌ రన్‌ కూడా పూర్తి అయింది. ఆగష్టు 6న ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ రైలు ప్రారంభిస్తారు. కాచిగూడ స్టేషన్‌ నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా డోన్‌ మీదుగా యశ్వంత్‌పూర్‌కు ఈ రైలు చేరుతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.

ఇప్పటికే పూర్తైన ట్రయల్ రన్.. 

ట్రయల్‌రన్‌లో భాగంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ సోమవారం ఉదయం 6.30 గంటలకు నంద్యాల జిల్లా డోన్‌లో బయలుదేరి 10.30 గంటలకు కాచిగూడకు చేరుకుంది. ప్రస్తుతం కాచిగూడ స్టేషన్‌లోనే రైలు ఉంది. ఆగస్టు 6న ప్రధాని మోదీ ప్రారంభించిన తర్వాత ఈ రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీంతో పాటు అమృత్‌ భారత్‌ స్కీం కింద తెలంగాణలో ఎంపిక చేసిన మల్కాజిగిరి, మలక్‌పేట, ఉప్పుగూడ, నిజామాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌లో అభివృద్ధి పనులకు కూడా మోదీ వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గంటలకు 180 కిలోమీటర్ల వేగంతో.. 

తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్‌ రైలు సికింద్రిబాద్‌-విశాఖపట్నం మధ్య ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. ఆ తర్వాత సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో రైలును ప్రారంభించారు. ఈ రెండు రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ రావడంతో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఈ క్రమంలోనే కాచిగూడ- యశ్వంతపూర్‌ రైలును తీసుకొచ్చింది. అత్యాధునిక హంగులతో, గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గమ్య స్థానాలకు చేరే వీలుండటంతో ఈ రైళ్లకు ఆదరణ లభిస్తోంది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా  400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఛార్జీలు కాస్త అధికం..

వందే భారత్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. 180 కిలీమీటర్ల వేగంలోనూ కుదుపులు లేకుండా ప్రయాణం సాగడం దీని ప్రత్యేకత. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్టేషన్లు, ఇతర సమాచారం అందించేందుకు ఎలక్ట్రిక్ బోర్డులు ఉన్నాయి. ఆటోమేటిగ్గా తెరుచుకునే, మూసుకునే డోర్లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలో సీట్లు 360 డిగ్రీల్లో తిరుగుతాయి. అద్దాల నుంచి ప్రకృతి అందాలను చూస్తూ ప్రయాణిస్తూ జర్నీ అస్వాదించవచ్చు. బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, అంధుల కోసం బ్రెయిలీ లిపిలో సమాచారం, వరదల నుంచి రక్షణకు ప్రత్యేక ఏర్పాటు ఈ రైళ్లకు స్పెషల్ గుర్తింపు తీసుకువచ్చాయి. అయితే సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లలో టికెట్ ఛార్జీలు కాస్త అధికంగా ఉన్నాయని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు