ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. తెలంగాణలో రాజకీయ (Telangana Politics) సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా జూబ్లిహిల్స్ బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ ను బీజేపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ తో (Srishailam Yadav) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సమావేశం కావడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. సుమారు 40 నిమిషాల పాటు కిషన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే.. సమావేశ అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక ఎంపీగా ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నాయకులను కలుస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే శ్రీశైలంను కలిసినట్లు చెప్పారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని శ్రీశైలం యాదవ్ ను కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: అడ్డంగా బుక్కైన మంత్రి మల్లారెడ్డి.. నామినేషన్ రిజెక్టేనా?
ఈ అంశంపై శ్రీశైలం యాదవ్ సైతం స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేవలం మర్యాదపూర్వకంగానే తమ ఇంటికి వచ్చారని తెలిపారు. అతిథిగా వచ్చిన అందరినీ ఏ విధంగా గౌరవిస్తామో అదే తరహాలో ఆయనను గౌరవించామన్నారు. అయితే.. తమను పార్టీలోకి ఆహ్వానించేందుకు మాత్రం కిషన్ రెడ్డి రాలేదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో శ్రీశైలం యాదవ్ కుటుంబానికి మంచి పట్టు ఉంది.
ఒక వేళ నవీన్ యాదవ్ నామినేషన్ ను విత్ డ్రా చేసుకుని బీజేపీకి మద్దతు ప్రకటిస్తే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతాయన్న చర్చ సాగుతోంది. అయితే.. తెలంగాణలో నామినేషన్ల గడువు ఈ నెల 10తో ముగిసింది. నామినేషన్ల స్క్రూటినీ 13తో ముగిసింది. ఇంకా నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు రేపటి వరకు అవకాశం ఉంటుంది. దీంతో ఇండిపెండెట్ గా పోటీ చేసిన వారిని విత్ డ్రా చేయించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రేపు సాయంత్రంలోగా భారీగా నామినేషన్లు విత్ డ్రా అయ్యే అవకాశం ఉంది.