జోగులాంబ గద్వాల జిల్లాలో ఏడాది విత్తనపత్తి మల్దకల్, ధరూరు, కేటి దొడ్డి, గట్టు, గద్వాల మండలాలలో సుమారు 35వేల ఎకరాల నుండి 40 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలను సాగు చేస్తూ ఉన్నారు. ఏప్రిల్, మే నెలలో కంపెనీలు ఆర్గనైజర్ల ద్వారా విత్తనాలను రైతులకు ఒప్పంద పద్ధతిలో అందజేస్తారు. రైతులు బోరు బావుల కింద ఏప్రిల్, మే నెలలోనే విత్తనాలు వేసి పంట సాగు చేస్తారు. జూన్, జూలై నాటికి పంట ఏపుగా పెరిగి క్రాసింగ్ చేస్తారు. ఈ దశలోని రైతులు కూలీలు తోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. మల్దకల్ మండలం బిజ్వారం, మేకల సంపల్లీ గ్రామంలో దాదాపు 80 మంది' రైతులు కర్నూలు కేంద్రంగా ఉన్న ప్రముఖ కంపెనీకి చెందిన ఫౌండేషన్ విత్తనాలను మధ్యవర్తుల ద్వారా తీసుకోని నాటుకున్నారు.
మొక్కలు బాగానే ఏపుగా పెరిగినా విత్తనపత్తి పంటలో కీలకమైన క్రాసింగ్ సమయానికి మొగ్గలో పుప్పడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జాన్ మాసం మొత్తం ముగిసినా ఆశించిన వర్షాలు లేకపోవటం ఒక వైపు మరో పక్క పుప్పడి రాకపోవటంతో క్రాసింగ్ చేసినా పిందె నిలబడక పోవటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో బిజ్వారం, మేకల సంపల్లీ గ్రామంలో దాదాపు 180 మంది రైతులు ఇలా పంట నష్టపోతున్నారు. దీనిపై గ్రామంలో వైఎస్ఆర్ కూడలిలో నిరసనకు దిగారు. శ్రీరామ, వేద కంపెనీ విత్తనాల లోపం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని వారు ఆరోపించారు. ఒక్కో ఎకరా మీద ఇప్పటికే రూ.40వేల వరకు ఖర్చు చేసి కూలీలకు లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాము కానీ, తీరా క్రాసింగ్ సమయంలో ఈ సమస్య కారణంగా పంట దిగుబడి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
ఒక్క గ్రామంలో ఇప్పటికే పెట్టిన పెట్టుబడి రూ. 20 లక్షల వరకు అయ్యిందని తెలిపారు.నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో శ్రీరామ, వేద కంపెనీ వేసిన ప్రతి రైతు ఇదే విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 20 శాతం వరకు ప్రస్తుతం క్రాసింగ్ సమయంలో వచ్చే పుప్పడి రాక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయకులు వివరణ కోరగా.. రైతుల సమస్య మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని కంపెనీల దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.