రిక్షావాలా టు మినిస్టర్.. ఎవరీ రత్నేష్ సదా..! By Trinath 16 Jun 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఒక సామాన్యుడు రాజకీయాల్లో రాణించి.. అంచలంచెలుగా ఎదుగుతూ సీఎం, పీఎం అయిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అలాంటి కోవకే చెందుతారు రత్నేష్ సదా. బిహార్ కు చెందిన ఈ నేత మొదట్లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించేవారు. రాజకీయాల వైపు అడుగులు వేసి బిహార్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఇప్పడీ లీడర్ ను మంత్రి పదవి వరించింది. హిందూస్తానీ అవాం మోర్చా పార్టీ అధ్యక్షుడు సంతోష్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈయన ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంజీ కుమారుడే ఈ సంతోష్ సుమన్. ఈయన రాజీనామాతో మంత్రి వర్గ విస్తరణపై సీఎం నితీష్ దృష్టి పెట్టారు. ముఖ్యంగా దళిత నాయకుడ్ని మంత్రి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే సదాతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన మరికొందరు నేతలను కూడా మంత్రులుగా ఎంపిక చేశారు. వీరంతా ప్రమాణ స్వీకారం చేశారు. రత్నేష్ సదా తొలినాళ్లలో.. రత్నేష్ సదా తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు. రాజకీయాల్లోకి రాకముందు రిక్షా తొక్కి జీవనం సాగించేవారు. ఈయన మహిషి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమర్ గ్రామ నివాసి. ఈయన ఫ్యామిలీ సోన్ బర్సాలోని కహ్రా కుటీలో నివసిస్తోంది. తండ్రి కార్మికునిగా పనిచేసేవాడు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రత్నేష్ సదా గ్రాడ్యుయేట్. ఈయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజకీయాల్లో అడుగులు రత్నేష్ సదా రాజకీయ జీవితం 1987లో ప్రారంభమైంది. అంచలంచెలుగా ఎదుగుతూ 2010లో జేడీయూ తరఫున సోన్ బర్సా రిజర్వ్ డ్ స్థానం నుండి ఎమ్మెల్యే అయ్యారు. వరుసగా మూడుసార్లు గెలిచారు. ఈయన జేడీయూ మహాదళిత్ సెల్ అధ్యక్షుడు కూడా. జేడీయూ ఉపాధ్యక్ష పదవితోపాటు పార్టీలో ఇతర కీలక పదవులు కూడా నిర్వహించారు. ప్రస్తుతం జేడీయూ విప్ గా ఉన్న ఈయన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. సదా చర, స్థిరాస్తుల విలువ 1.30 కోట్లు. ఈయనపై ఎటువంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు. నితీశ్ ప్లాన్ ఇదే! మంచి ఫాలోయింగ్ ఉన్న రత్నేష్ సదాను బాగా హైలైట్ చేయడానికి నితీశ్ ఉత్సాహంగా ఉన్నారు. దీనికి కారణం.. సంతోష్ సుమన్ రాజీనామాతో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడమే. 2022లో మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీయూ బీజేపీతో బంధాన్ని తెంచుకుంది. సుమన్ రాజీనామా తర్వాత బిహార్ కేబినెట్ లో 30 మంది మంత్రులు అయ్యారు. అసెంబ్లీ మొత్తం బలం ఆధారంగా, గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు. 243 సీట్ల బిహార్ అసెంబ్లీలో మహాఘట్ బంధన్ లో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేబినెట్ లో ఆర్జేడీకి 16 మంది, జేడీయూకి 11 మంది, కాంగ్రెస్ కు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒక స్వతంత్ర సభ్యుడు కూడా ఉన్నారు. సంతోష్ సుమన్ శాసనమండలి సభ్యుడు కాగా, హెచ్‌ఏఎంకు అసెంబ్లీలో మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి