/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/moranchaally-fet-jpg.webp)
అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally).. గణపురం మండలం.. మోరంచపల్లి గ్రామం ((moranchapalli village).. రాత్రి 12దాటింది.. అంతా నిద్రిస్తున్నారు.. ఇంతలోనే కాళ్లకి నీరు తగిలినట్టు అనిపించింది. లేచి చూస్తే ఇళ్లంతా నీటిమయం.. ఇంటి డోర్ల స్పెస్‌లో నుంచి వరద దూసుకొస్తోంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఇల్లు మొత్తం నీటిమయమైపోయింది. ఇంటిలోని సామాన్లు, ఇతర వస్తువులు, వంట గిన్నెలు ప్రతీ వస్తువూ నీటిలో తేలియాడుతుంటే బాధిత కుటుంబాలు విలవిలలాడాయి. తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ముందు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంటి నుంచి బయటపడ్డారే కానీ.. కష్టపడి కొనుక్కున్న వస్తువులు నీటిపాలు కావడం వాళ్లని తీవ్రంగా కలిచివేసింది.
మోరంచపల్లిలో మొరంచ వాగు ధాటికి గ్రామం అల్లకల్లోలమైంది. అర్థరాత్రి అందరూ నిద్రిస్తుండగా గ్రామంపై ఒక్కసారిగా వరద దాడి చేసింది. వరద ఉధృతికి గ్రామం ఒక్కసారిగా అతలాకుతలమైంది. ప్రస్తుతం మొరంచ వద్ద వరద ఉధృతి పూర్తిగా తగ్గింది. గ్రామంలో ఎటు చూసినా బాధిత ప్రజల కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కళకళలాడిన తమ ఇంటిని.. విధ్వంసం తర్వాత కనిపిస్తున్న తమ ఇంటిని చూసుకుంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సుమారు 250కి పైగా నివాస గృహాలు ఉండే ఈ గ్రామంలో 600 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వరదల వలన గ్రామానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ ఇప్పటికీ తెలియ రాలేదు. వరదల్లో చిక్కుకున్న స్థానిక ప్రజలను బొట్ల ద్వారా రక్షించి గాంధీ నగర్, కర్కపల్లి వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి వసతి కల్పించారు. వరదల్లో చిక్కుకొని సుమారు 150కి పైగా పశువులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని పశువులు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. నివాస గృహాలు ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఉండే గృహపకరణాలు, సామాగ్రి అన్నిచెల్లాచెదురయ్యాయి. వరద ప్రభావంతో కుందయ్యపల్లి మొరంచ గ్రామాల మధ్య రహదారి పూర్తిగా ధ్వంసమైంది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకొని పరిస్థితులు సమీక్షిస్తున్నారు.
ఆపరేషన్ మోరంచపల్లి సక్సెస్:
తెలంగాణలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామ శివారులోకి వరద వచ్చి చేరడంతో ఇళ్లన్ని నీట మునిగాయి. వెంటనే రంగంలోకి దిగిన సహాయిక బృందాలు గ్రామస్తులను రక్షించేందుకు హెలికాప్టర్లు, బోట్లతో ఎంట్రీ ఇచ్చారు. అందరినీ సురక్షితంగా కాపాడారు. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు. అక్కడి నుంచి పునరావాస కేంద్రానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తరలించాయి. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను అధికారులు రక్షించారు. సహాయక చర్యల్లో 2 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. గ్రామస్తులను 6 ఫైర్ డిపార్ట్‌మెంట్ బోట్లు తరలించాయి. గ్రామం మొత్తాన్ని అధికారులు ఖాళీ చేయించారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా సిబ్బంది రెస్క్యూ చేశారు.