జిల్లాలోని ప్రసిద్ధ మండలం అయినటువంటి పాలకుర్తి మండలవ్యాప్తంగా వానలు నాన్‌స్టాప్‌గా కురుస్తున్నాయి.దీంతో పాలకుర్తి, దర్దేపెల్లి, గూడూరు, గోపాలపురం, మల్లంపల్లి, భిక్యానాయక్ తండ, రాఘవాపురం, బొమ్మెర,వల్మిడి,ముత్తారం, ఏడునూతల తదితర గ్రామాలకు ఎక్కడికక్కడ రాకపోకలు బంద్ అయ్యాయి.పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మీద గాలి దుమారానికి పడ్డ చెట్లను సిఐ విశ్వేశ్వర్, ఎస్ఐ శ్రీకాంత్ అధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తెల్లజాము వరకు జేసీబీ సహాయంతో సిబ్బందిని ఉపయోగించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించారు.
ఆయా గ్రామాలకు రాకపోకలు బంద్
దర్దేపల్లి పాలకుర్తి గ్రామాల మధ్య వున్న కల్వర్టు మీద ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో ప్రమాదవశాత్తు ఇరుక్కున్న ఇద్దరు యువకులను పాలకుర్తి పోలీసులు తాడు సాయంతో ఒడ్డుకు చేర్చి వారిని కాపాడారు.ఇక దేవరుప్పుల మండలం చింతబ్బాయి గడ్డ తండా దగ్గర ఉదయం రోడ్డు మీద పడ్డ చెట్లను ఎస్సై రమేష్ నాయక్ ఆధ్వర్యంలో 20 నిమిషాలలో తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.మిగతా చోట్ల వర్షం దాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్న ఎలాంటి ఇబ్బందులు మాత్రం లేవు.మరికొన్ని గ్రామాల్లో మాత్రం పలు కాలనీలు పూర్తిగా వర్షపు నీటితో నిండు కుండను తలపిస్తున్నాయి.పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ శివలింగయ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి
మంత్రి దయాకర్‌రావు సొంత నియోజకవర్గమైనటువంటి పాలకుర్తి పరిస్థితులను మంత్రి ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు.అంతేకాకుండా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల్లో మనోదైర్యాన్ని కలిగిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా అధికారులు తట్టుకునే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు.అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రాత్రంతా సిఐ విశ్వేశ్వర్,ఎస్ఐ శ్రీకాంత్ అధ్వర్యంలో పోలీసులు తీవ్రంగా శ్రమించారు.ప్రజలు ఎవరు కూడా చేపలు పట్టడానికి చెరువులు, వాగుల వద్దకు వెళ్ళొద్దని సూచించారు.విద్యుత్ శాఖా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని విద్యుత్ సిబ్బందిని మంత్రి కోరారు.