Janasena Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భారీ విరాళాన్ని అందించారు. జనసేన పార్టీ నిర్వహణ అవసరాల నిమిత్తం రూ.10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి. రత్నంకి విరాళం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పది. ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లను అందజేస్తున్నాను. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. జనసేన పార్టీ ప్రయాణానికి సగటు కూలి తన చిన్నపాటి సంపాదనలో రూ. వంద పక్కన పెట్టి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పాడుతున్నారు.
Also read: వైసీపీ ప్రచార సామాగ్రి సీజ్.. దాదాపు 2 కోట్ల డబ్బు.. ఆందోళన చేపట్టిన టీడీపీ
ఓ బెల్దారీ మేస్త్రి రూ.లక్ష విరాళం అందించారు. అలాగే పింఛను నుంచి వచ్చే సొమ్ములో కొంత భాగం పార్టీకి తమ వంతుగా పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారు. వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సాయం అందిస్తున్నారు. అలాంటి వారి స్ఫూర్తితో నేను సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బును పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల వేళ ఈ డబ్బు పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ బి. మహేందర్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ నేతలు మర్రెడ్డి శ్రీనివాస్, పంచకర్ల సందీప్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.