ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై జనసేన నేత షాకింగ్ కామెంట్స్.!

ప్రైవేటు ల్యాబ్ ల యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. వ్యాధి నిర్ధారించే పరీక్షలను ఆసుపత్రిలో చేయకుండా వైద్యులు ప్రైవేటు ల్యాబ్ లకు రిఫర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై జనసేన నేత షాకింగ్ కామెంట్స్.!

Eluru: ప్రైవేటు ల్యాబ్ ల యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లాలోని 40 గ్రామాల నుంచి ప్రతీ రోజూ వైద్య సేవల కోసం బాధితులు వస్తుంటారన్నారు. రోగికి వ్యాధి నిర్ధారించే పరీక్షలను ఆసుపత్రిలో ఏళ్ల తరబడి ఉచితంగానే చేస్తున్నారని తెలిపారు. అయితే, గత కొంతకాలం నుండి అవుట్ పేషెంట్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా ప్రైవేటు ల్యాబ్ లకు రిఫర్ చేస్తున్నారని, ఒక్క ఎమ్మారై స్కానింగ్ కు రూ. 5 వేల వసూలు చేస్తూ రూ. 1500 కమిషన్ ను రిఫర్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు ముట్ట చెబుతున్నారని తెలిపారు. ఇలా ప్రతిరోజు లక్షల రూపాయలు పేద రోగుల నుంచి కమిషన్ ద్వారా దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: సీఎం పదవిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.!

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో సహా పలువురు డాక్టర్లు కమీషన్లకు ప్రాధాన్యత ఇస్తూ అవుట్ పేషెంట్లను ప్రైవేట్ ల్యాబ్ లకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి రోగానికి కూడా ఆసుపత్రిలో వైద్యసేవలు అందించకుండా విజయవాడ లేదా గుంటూరుకు రిఫర్ చేయడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, అప్పుల పాలవుతున్నారని వాపోయారు. ఆసుపత్రిలో జరుగుతున్న ఈ విషయాలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు దృష్టి పెట్టి ఆసుపత్రికి వచ్చే ప్రతీ రోగికి రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులందరూ పేద మధ్య తరగతి ప్రజలేనని, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అనే తేడా లేకుండా వ్యాధి నిర్ధారణకు సంబంధించిన అన్ని వైద్య పరీక్షలను ఉచితంగా చేయాలన్నారు. లేకుంటే ఆసుపత్రి వద్ద ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు