జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని..అందుకోసం సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారంటూ వ్యాఖ్యానించారు. అధికారం కాపాడుకునేందుకు నాయకులు ఎంతవరకైనా తెగిస్తారని మండిపడ్డారు. అధికారం కోల్పోతామన్న భయంతోనే ఇలాంటి పనులకు పూనుకుంటున్నారని అన్నారు. తనను చంపేందుకు సుపారీ గ్యాంగులు ఏర్పాటు చేసినట్లు పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు జనసేనాని. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన జనసేన నాయకులతో పవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు.
అయితే తనకు ప్రజాబలంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేదిశగా జనసేన ప్రయాణం చేస్తుందని తెలిపారు. ఈ సమయంలోనే నాయకులు ఏమైనా చేసేందుకు ప్లాన్ చేస్తుంటారన్నారు. అధికారం పోతుందన్న భయంతో, భావన వారితో ఏదైనా చేయిస్తుందన్నారు. తనను ఎంత భయపెడితే అంతగా రాటుదేలుతానంటూ చెప్పారు. గతంలో జరిగిన కాకినాడ ఘటనను గుర్తు చేశారు. దాన్ని ఇంకా మర్చిపోలేదన్నారు. అప్పట్లో తమ పార్టీకి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతోనే వెనకడుగు వేయాల్సి వచ్చిందన్నారు. రాబోయో ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో 34స్థానాల్లో వైసీపీ ఒక్క సీటుకూడా గెలవకూడదని జనసేన కార్యకర్తలకు సూచించారు పవన్ కల్యాణ్ .