Korutla Deepthi Case: జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి మృతి కేసులో మిస్టరీ వీడనుంది. హైదరాబాద్‌లో చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీప్తి మృతి తర్వాత 40 తులాల బంగారం, రెండు లక్షల రూపాయలను తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదు, బంగారంతో పాటు పాస్ పోర్టు కూడా తీసుకెళ్లడంతో ఆమె విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. రేపు(శనివారం) ఉదయం కోరుట్లలో ప్రెస్‌మీట్ పెట్టి పోలీసులు అన్ని వివరాలు వెల్లడించనున్నారు.
కలకలం రేపుతున్న చెల్లెలు చందన ఆడియో కాల్..
దీప్తి మృతితో తనకు సంబంధం లేదన్న చెల్లెలి ఆడియో కలకలం రేపుతోంది. ఎవరో బాయ్ ఫ్రెండ్ ఆక్కకు ఫోన్ చేశాడని తమ్ముడికి చందన వివరించింది. డబ్బులు, బంగారం మాయం కావటం.. దీప్తి ఒంటిపై గాయాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. అనుమానస్పదంగా మృతి చెందినా.. దీప్తి ఒంటిపై స్వల్పగాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు సమాచారం. అంతేకాకుండా దీప్తి టీషర్ట్ కింద కాస్త కమిలిన గాయాలు, చెంపపై గీసుకుపోయినట్లుగా ఓ చిన్న గాయం ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు దీప్తి చేతులు కట్టేసినట్లుగా మణికట్టు వద్ద గాయం ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ చేయి విరిగి ఉంటే పక్కాగా దీప్తి హత్యకు గురైందన్న అంశానికి మరింత బలం చేకూరేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీప్తిది హత్యా? ఆత్మహత్యా?
చందన.. తమ్ముడు సాయికి పంపినట్టుగా భావిస్తున్న ఓ ఆడియోలో సాయి.. “నేను చందు అక్కను’.. అసలు నిజం ఏంటంటే..? దీప్తి అక్క, నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాం..!! కానీ.. నేను తాగలేదు.. అక్కనే తాగింది. నేను ‘మా ఫ్రెండ్ చేత రెండు మందు బాటిళ్లు’ తెప్పించినట్లు నేను ఒప్పుకుంటా.. కానీ నేను తాగలేదని చందు చెప్పింది. అక్క తాగి తన బాయ్ ఫ్రెండ్‌ను పిలుస్తా అంటే నేను ఒప్పు కోలేదు. అయినా పిలుస్తాను అనడంతో ఒప్పుకున్నా అని చందు ఫోన్‌లో సాయికి వివరించింది. ఇంట్లోంచి నేను వెళ్లిపోవాలని అనుకున్నది నిజమే కానీ అక్కకు చెప్పి వెళ్లిపోదాం అనుకున్నా. ‘మీరు అందరూ నన్ను వెయిట్ ఉన్నావని అంటుంటే బయటకు వెళ్లి ఒంటరిగా ఉండాలని అనుకున్నా.. నాకు బయట ఎక్కడా డబ్బులు లేవు అందుకే డబ్బులు తీసుకున్నా” అని ఉంది.
నేను బ్రీజర్ తాగాను..
“నేను అక్కను ఏమీ చేయలేదు.. ప్లీజ.. నమ్మండి నన్ను. అక్క తాగుదాం అంటేనే నా ఫ్రెండ్‌కు చెప్పి రెండు బాటిల్స్ తెప్పించాను. నేను బ్రీజర్ తాగాను. అక్క ఓడ్కా తాగింది. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు” అంటూ ప్రాధేయపడుతూ తమ్ముడికి పంపినట్టుగా ఉన్న వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది. దీప్తి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు వివరాలను సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఉందని, దీప్తిది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం పూర్తి విచారణ తర్వాత తెలుస్తుందని సీఐ పేర్కొన్నారు.
Also Read: చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..!