ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కానీ ఇరు వర్గాల ప్రతీకార చర్యలతో సామాన్యులు సైతం చనిపోతున్నారు. ఒక మిలిటెంట్ కమాండర్‌ను హతమార్చాడానికి వందలమంది సామాన్యులను ఇజ్రాయెల్(Israel) దళాలు బలితీసుకుంటుండగా.. అటు హమాస్ ఇజ్రాయెల్ ఆర్మీపై దాడులు చేస్తున్న క్రమంలో చిన్నపిల్లలను సైతం పొట్టనపెట్టుకుంటోంది. చంపుకోవడం విషయంలో ఇరు వర్గాలది ఒక్కటే తీరుగా కనిపిస్తోంది. అక్టోబర్ 7న మొదలైన దాడుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఏ వర్గం కూడా వెనక్కి తగ్గడంలేదు. పోటి పడి చంపుకుంటున్నారు. అటు యుద్ధాన్ని ఆపాల్సిన అగ్రరాజ్యాలు ఏదో ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తూ పరోక్షంగా హింసకు కారణం అవుతున్నాయి. తాజాగా గాజాలోని అతిపెద్ద శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో హమాస్ మిలిటెంట్ల కంటే సామాన్య పౌరులే ఎక్కువ మంది చనిపోయారు
కమాండర్ హతం:
గాజాలోని అదిపెద్ద శరణార్థుల శిబిరం జబాలియా. ఇక్కడ వేలాది మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సస్ ఈ క్యాంప్‌పై దాడి చేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్(Hamas) దాడికి కీలక సూత్రధారి అయిన ఇబ్రహీం బియారీ(Ibrahim Biari) ఈ శిబిరంలో ఉన్నాడన్న పక్కా సమాచారంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. హమాస్‌లోని ఓ గ్రూప్‌ను ఇప్పటివరకు నడిపిస్తోన్న మిలిటెంట్ బియారీనే. దీంతో శిబిరంపై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో బియారీ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
పౌరులు కూడా..:
ఇజ్రాయెల్ దాడుల్లో 50మంది పాలస్తీనియన్లు కూడా మరణించినట్లు సమాచారం. 150మంది శరణార్థులు గాయపడ్డారని తెలిపింది. అటు హమాస్ టాప్ లీడర్లు ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తున్నారు. కనీసం 400మంది శరణార్థులను ఇజ్రాయెల్ చంపేసిందని ఆరోపిస్తున్నారు. 1948నాటి యుద్ధాల కారణంగా.. కుటుంబాలను కోల్పోయిన వారు ఎక్కువగా జబాలియాలో ఉంటారు. వారిని టార్గెట్‌గా చేసుకొనే ఇజ్రాయెల్ దాడులు చేసిందని ఆరోపిస్తుండగా.. అక్టోబర్ 7న తమపై దాడులు చేసి.. హమాస్ గ్రూప్‌కు నాయకత్వం వహించిన బియారీని చంపడానికే శిబిరంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ జబాలియా బెటాలియన్ శిబిరం చుట్టు పక్కల ప్రాంతంలోని అనేక పౌర భవనాలను స్వాధీనం చేసుకుందని ఇజ్రాయెల్ చెబుతోంది. పౌరుల భద్రత కోసం ఉత్తర ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించినట్లుగా సమాచారం.
Also Read: కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు