తన ప్రభుత్వ అధికారాలను హరించడానికి ఉద్దేశించిన ఢిల్లీ వివాదాస్పద ఆర్డినెన్స్ పార్లమెంటులో వ్యతిరేకించాలని, ఈ విషయంలో తనకు మద్దతునివ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలను కలిసి అభ్యర్థించారు. మొదట దీనిపై కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకంజ వేసినప్పటికీ, చివరకు ఆయనకు మద్దతునివ్వడానికే నిర్ణయించుకుంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చిన విపక్ష సభ్యులు.. ఢిల్లీ ఆర్డినెన్స్ పై కూడా సభలో సర్కార్ ని గట్టిగా నిలదీసే సూచనలు ఉన్నాయి. ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) బిల్లు పేరిట ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో తెచ్చినప్పుడు ప్రతిపక్ష కూటమి దీనిపై బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేనిపై విరుచుకుపడే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే 13 ముసాయిదా బిల్లులు సిద్ధం
బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంటులో ఆమోదానికి గాను 13 ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఓ వైపు సర్కార్ పై విపక్షాల అవిశ్వాస తీర్మానం పెండింగులో ఉన్నప్పటికీ.. మరోవైపు ఎప్పటికప్పుడు ముఖ్యమైన బిల్లులు సభ ఆమోదం పొందేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మణిపూర్ పై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలను స్తంభింపజేస్తుండగానే రాజ్యసభ మూడు బిల్లులను ఆమోదించింది. సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లుతో సహా రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్అండ్ డెత్స్ (సవరణ) బిల్లు, ది కాన్స్టిట్యూషన్ (జమ్మూ అండ్ కశ్మీర్) ఎస్సీ ఆర్డర్ (సవరణ) బిల్లు వంటివి వీటిలో ఉన్నాయి. ఈ బిల్లుల్లో సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు ముఖ్యమైనది. దీనిని లోక్ సభ ఆమోదించాల్సి ఉంది.
మా సత్తా చూడండి.. ప్రహ్లాద్ జోషీ
విపక్షాలు ఎంతగా ప్రయత్నించినా బిల్లులను అడ్డుకోలేవని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. సభలో మా సత్తా చూడండి అని ఆయన సవాల్ చేశారు. లోక్ సభలో మీకు తగినంతమంది సభ్యులున్నారో లేదో చూసుకోవాలన్నారు. వాళ్ళు(విపక్షాలు) హఠాత్తుగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెచ్చారని, అంటే పార్లమెంటులో ప్రభుత్వ సంబంధ కార్యకలాపాలేవీ జరగకూడదన్నది వారి ఉద్దేశమా అని ఆయన ప్రశ్నించారు. మీకు మెజారిటీ ఉంటే సభలో బిల్లులు వీగిపోయేలా చూడండి అని కూడా వ్యాఖ్యానించారు.
ఏదైనా ‘తీర్మానం’ తరువాతే.. కాంగ్రెస్
అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ లోక్ సభలో అనుమతించిన తరువాత సభ ఆమోదించిన బిల్లులన్నీ ‘రాజ్యాంగ బద్ధంగా అనుమానించదగినవే’నని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. అవిశ్వాస తీర్మాన ఫలితం వెలువడిన తరువాతే పార్లమెంటులో లెజిస్లేటివ్ సంబంధమైన ఏ అంశమైనా ముందుకు వెళ్లాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తీర్మానంపై చర్చకు 10 రోజుల సమయాన్ని నిర్దేశిస్తే దాన్ని బిల్లులను గంపగుత్తగా ఆమోదించడానికి వినియోగించుకునే వ్యవధిగా పరిగణించరాదన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఒకసారి లోక్ సభలో ప్రతిపాదించాక ఇక సభ ముందుంచే ఏ బిల్లు అయినా పార్లమెంటరీ సంప్రదాయాలను, నైతికతను ఉల్లంఘించినట్టేనని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రభుత్వం వచ్చేవారం పార్లమెంటులో ప్రతిపాదించనున్న నేపథ్యంలో మనీష్ తివారీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.