Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ పండుగ అంటేనే బంగారంతో పని. ఈ సంవత్సరం మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తోంది. ఆరోజు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు మనదేశంలో. ఏటా ఈ రోజున దేశంలో వేల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా బంగారం వ్యాపారం పెద్దగా జరిగే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే, అధిక ధరలు, పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ముగిసిపోవడం, అలాగే దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కారణంగా చెబుతున్నారు. ఎన్నికల్లో బంగారం కొనుగోలుపై పరిమితులు ప్రభావాన్ని చూపిస్తాయని అంచనా వేస్తున్నారు.
Also Read: హమ్మయ్య.. బంగారం ధరలు కాస్త తగ్గాయి.. ఈరోజు ఎంతంటే..
ధరల పెరుగుదలతో..
Akshaya Tritiya 2024: ఇటీవల కాలంలో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో సామాన్యులు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. అక్షయతృతీయ వస్తే కొద్దిపాటి బంగారం అయినా కొనాలని ఆలోచించే పసిడి ప్రేమికులు ప్రస్తుతం ధరల తీరు చూసి వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. ఎప్పుడూ అక్షయ తృతీయ(Akshaya Tritiya 2024) సమయానికి పెళ్లిళ్ల సీజన్ నడుస్తూ ఉంటుంది. ఈసారి పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ముగిసింది. మూఢం కారణంగా పెళ్లిళ్లకు మరో మూడు నెలల వరకూ ముహూర్తాలు లేవు. ఈ నేపథ్యంలో బంగారం ఇప్పుడు కొనుక్కోవడం విషయంలో అందరూ ఆలోచనలో పడతారు. ఎందుకంటే, మూడు నెలల తరువాత బంగారం ధరలు తగ్గవచ్చని అంచనాలు నిపుణులు చేస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో అక్షయ తృతీయకు బంగారం కొని పెళ్లిళ్ల కోసం దాచుకోవాలని ఆలోచించేవారు వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఇక అధిక ధరల నేపథ్యంలో కొత్తగా బంగారం కొనకుండా.. పాత బంగారు ఆభరణాలను మార్పిడి చేయడం అమ్మడం చేసి కొత్త బంగారం తీసుకుంటున్నారు. దీనివలన కూడా బంగారానికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిపుణులు కూడా ఇదే అంచనాలు వేస్తున్నారు.
డిమాండ్ పెరిగే ఛాన్స్ లేదు..
Akshaya Tritiya 2024: రాబోయే రోజుల్లో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గుతుంది. బంగారం, నగదు తరలింపును ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలించడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ధరలు తగ్గకపోయినా.. ఈ పది రోజుల్లో పెరగకుండా ఉంటే కనుక డిమాండ్ పెరిగే అవకాశాలు కొద్దిమేర ఉండొచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ కనిపించడం లేదు.
మ్మొత్తంగా చూసుకుంటే బంగారాన్ని కొనుక్కోవాలని అందరూ భావించే అక్షయ తృతీయ పండగ.. బంగారం లేకుండానే సాగిపోయేట్టుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం మన దేశంలో బంగారం ధర ఎంత ఉందంటే..
ప్రపంచ స్థాయిలో బలహీన ధోరణి మధ్య, దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రూ.130 తగ్గింది. ఆ తర్వాత 10 గ్రాముల బంగారం ధర రూ.72,750కి చేరింది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.72,880 వద్ద ముగిసింది. మరోవైపు, న్యూయార్క్ Comex మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు $ 2,333 వద్ద ఉంది, ఇది మునుపటి ముగింపు ధర కంటే ఐదు డాలర్లు తక్కువ. ఇది కాకుండా, గత అర్థరాత్రి దేశంలోని ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. రాత్రి 10.25 గంటలకు పది గ్రాముల బంగారం ధర రూ.101 పెరిగి రూ.71,601 వద్ద ట్రేడవుతోంది