Iraq Fire Accident: ఇరాక్ దేశంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మందికి పైగా మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. కాసేపట్లో పెళ్లి జరగనుంది. దీంతో అప్పటివరకు ఆ హాల్ అంతా సందడిగా ఉంది. అంతా ఈ వేడుకలో మునిగిపోయారు. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్థం కాక వధూవరులతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఉత్తర నినేవే ప్రావిన్స్‌లోని హమ్దానియా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
రాత్రి 10.45కు ఒక్కసారిగా పెళ్లి మండపంలో మంటలు చెలరేగాయి. కాపాడాలంటూ ఆర్తనాదాలు పెడుతూ అక్కడున్న వారంతా బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే మంటలు చుట్టుముట్టేయడంతో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వెడ్డింగ్ హాల్‌లో వెయ్యి మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఎగసిపడిన అగ్నికీలలకు వెడ్డింగ్ హాల్ మొత్తం బూడిదగా మారిపోయింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనతో ఆ ప్రాంతమంతా భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. వివాహ వేడుకలో కాల్చిన బాణాసంచా కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక అంచనాకొచ్చారు స్థానిక అధికారులు. ప్రధానమంత్రి మహమ్మద్ షియా అల్ సుడానీ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వివాహ సమయంలో బాణసంచా పేల్చటంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫంక్షన్ హాల్‌లో సామాగ్రికి వేగంగా మంటలు అంటుకోవటంతో వేడుకలో పాల్గొన్నవారు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.. అగ్ని ప్రమాదం సమాచారం అందగానే వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. అక్కడికి అంబులెన్స్‌లు పంపించి క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని వెల్లడించారు.
ఇదది కూడా చదవండి: అవును అతను మోసం చేశాడు…తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్