Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కుప్పకూలడం ఆ దేశానికి పెద్ద దెబ్బ. ఈ ప్రమాదంలో ఆయన మరణించినట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. విషాదకర ఈ సంఘటన నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రముఖులు మరణించినపుడు వెల్లువెత్తే ఎన్నో అనుమానాలు.. ఇప్పుడు కూడా వస్తున్నాయి. నిజానికి దేశాధ్యక్ష పదవిలో ఉన్న ముఖ్యమైన వారు తమ దేశంలోని అత్యుత్తమ హెలికాప్టర్‌లతో పాటు ఉత్తమ పైలట్లు-నిర్వహణ బృందాలను కలిగి ఉంటారని మనం నమ్ముతాం. అలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రముఖులు కనిపించకుండా పోయే.. లేదా ప్రమాదాల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ గతంలో ఇలాంటి ప్రమాదాలు అంతర్జాతీయంగా చాలా జరిగాయి. చాలా మంది ముఖ్యమైన రాజకీయ మరియు సైనిక నాయకులు గతంలో హెలికాప్టర్ ప్రమాదాలలో మరణించారు. మన రాష్ట్రంలో కూడా హెలికాప్టర్ ప్రమాదంలో(Helicopter Crash) ప్రముఖులు మరణించిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం కూడా ఇదే విధంగా జరగడం ఇప్పుడు అందరికీ గుర్తు వస్తోంది. అంతకు కొన్నేళ్ల క్రితం లోక్ సభ స్పీకర్ గా ఉన్న జీఎంసీ బాలయోగి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి..
Helicopter Crash: సెప్టెంబర్ 2 - 2009 తేదీ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించే లక్ష్యంతో గ్రామాలకు ఆకస్మిక పర్యటనల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉదయం 8:30 గంటలకు బయలుదేరారు. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ఆయన బయలుదేరి వెళ్లిన కొద్ది సేపటికే హెలికాప్టర్ అదృశ్యమైందనే వార్తలు వచ్చాయి. అక్కడ నుంచి హెలికాప్టర్ కోసం వెతుకులాట ప్రారంభం అయింది. అయితే 24 గంటలపాటు ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఆ తరువాత.. కర్నూలుకు తూర్పున 40 నాటికల్ మైళ్ల దూరంలో నల్లమల్ల శ్రేణిలోని రుద్రకొండ కొండపై హెలికాప్టర్ క్రాష్(Helicopter Crash) కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు మరో నలుగురు మరణించినట్టు అప్పటి కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇన్ని ఏళ్ళు గడిచినా తెలుగు రాష్ట్రాల ప్రజల మనస్సుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తాలూకూ విషాదం చెదిరిపోలేదు.
జీఎంసీ బాలయోగి..
Helicopter Crash: లోక్ సభ మాజీ స్పీకర్, తెలుగుదేశం సీనియర్ నేత గంటి మోహనచంద్ర బాలయోగి (జీఎంసీ బాలయోగి) కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2002, మార్చి 3న భీమవరం నుంచి తిరిగివస్తుండగా కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామం వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ కిందికి దూసుకొచ్చి, ఒక కొబ్బరి చెట్టును ఢీకొట్టి మీపంలోని చేపల చెరువులో కూలిపోయింది. ఈ దుర్ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
నటి సౌందర్య..
Helicopter Crash: తెలుగు తెరపై మరో సావిత్రిగా పేరుతెచ్చుకున్న నటి సౌందర్య. ఆమె కూడా హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా 2004లో చనిపోయారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు 2004, ఏప్రిల్ 17న బెంగళూరు లోని జక్కూరు విమానాశ్రయం నుంచి తెలంగాణలోని కరీంనగర్ కు ఆమె రావాల్సి ఉంది. అయితే విమానం గాల్లోకి లేచిన క్షణాల్లోనే అదుపుతప్పి, ఎయిర్ పోర్టు పక్కనున్న గాంధీ వర్సిటీ ఆవరణలో కుప్పకూలింది. ఆ ప్రమాదంలో సౌందర్య సజీవ దహనమయ్యారు. ఆమె సోదరుడు అమరనాథ్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన కూడా దేశవ్యాప్తంగా చాలా అనుమానాలను రేకెత్తించింది.
జనరల్ బిపిన్ రావత్..
Helicopter Crash: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులోని కోయంబత్తూర్, కూనూరు మధ్య కుప్పకూలింది. అందులో రావత్, ఆయన భార్యసహా 14 మంది ప్రయాణించారు. కూనూరు నుంచి విల్లంగ్టన్ ఆర్మీ బేస్ కు వెళుతున్న సమయంలో ఎంఐ7 హెలికాప్టర్ ఇలా ప్రమాదానికి గురైంది.
సంజయ్ గాంధీ..
Helicopter Crash: భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ గాంధీ 1980, జూన్ 23న తేలికపాటి హెలికాప్టర్ గ్లైడర్ ప్రమాదంలో చనిపోయారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఆయన ప్రయాణిస్తున్న గ్లైడర్ కూలిపోవడంతో సంజయ్ స్పాట్ లోనే చనిపోయారు.
ఇవీ మన దేశంలో జరిగిన కొన్ని హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖుల వివరాలు. వీరేకాకుండా ఇంకొంతమంది ప్రముఖులు కూడా హెలికాప్టర్ లేదా విమానాల్లో ప్రయాణిస్తూ ప్రాణాలను కోల్పోయిన సంఘటనాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఇది విద్రోహ చర్య అని ఆరోపణలు వెల్లువెత్తడం సహజంగా జరుగుతూ వస్తుంది. అంతేకాకుండా, ఆయా సంఘటనల నేపధ్యం కూడా అనుమానించదగినదిగానే ఉంటుంది. కానీ, వీటిలో ఏ ఒక్కటీ కూడా కుట్ర పూరితంగా జరిగింది అని ఇప్పటివరకూ నిరూపితం కాలేదు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడి కథ కూడా అంతే.
ఇక అంతర్జాతీయంగా కూడా ఇలా హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు గాలిలో కలసిపోయిన ప్రముఖులు చాలామందే ఉన్నారు.. సెప్టెంబర్ 18, 1961న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ డాగ్ హమ్మార్స్క్‌జోల్డ్, 1971లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ వైస్ చైర్మన్ లిన్ బియావో, జూలై 31, 1981న పనామా అధ్యక్షుడు ఒమర్ టోరిజోస్, 19 అక్టోబర్ 1986న మొజాంబిక్ అధ్యక్షుడు సమోరా మాచెల్, 1988 ఆగస్టు 17న పాకిస్తాన్ అధ్యక్షుడు ముహమ్మద్ జియా-ఉల్-హక్ వంటి నాయకులు గతంలో ఇలాంటి ప్రమాదాల్లోనే మరణించారు.