Iran President Election: ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షునిగా వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్ ని నియమించారు. ఈయన 50 రోజుల పాటు మాత్రమే తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగగలుగుతారు. ఈలోపు అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. ఇరాన్ లో రెండంచెల పాలనా వ్యవస్థ ఉంది. మొదటిది సుప్రీం లీడర్. ఇరాన్‌లో, షియా ఇస్లామిక్ వేదాంతశాస్త్రంలో వెలయత్-ఇ ఫకీహ్ అని కూడా పిలిచే సుప్రీం లీడర్, దేశానికి అంతిమ పాలకుడు. దేశానికి సంబంధించిన అన్ని ప్రధాన నిర్ణయాల బాధ్యత ఆయనదే. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ. ఈయన దేశాధినేత.. అలాగే సైన్యం ఈయన ఆధీనంలోనే ఉంటుంది. అంటే ఈయన ఇరాన్ కు కమాండ్ ఇన్ చీఫ్ అని చెప్పవచ్చు. ఇక రెండో వ్యవస్థ అధ్యక్షుడు. ఇరాన్ అధ్యక్షుడు సాధారణ పరిపాలన, ప్రజా సంక్షేమం వంటి వాటికీ బాధ్యుడు. ఇంకా చెప్పాలంటే, ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ అధిపతి అని చెప్పవచ్చు.
అధ్యక్షుని ఎన్నిక ఇలా..
Iran President Election: నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే, ఎన్నికల ప్రక్రియలో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అధ్యక్షుడు ప్రభుత్వాన్ని నియంత్రిస్తాడు. ఆ వ్యక్తి రాజకీయ నేపథ్యం,బలాన్ని బట్టి, దేశ విధానం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తారు. అధ్యక్షుని ఎంపిక సుప్రీం లీడర్ అలాగే, గార్డియన్ కౌన్సిల్ పర్యవేక్షణలో ఉంటుంది. దీనిని (గార్డియన్ కౌన్సిల్) ఇస్లామిక్ మత గురువులతో రూపొందించారు. గార్డియన్ కౌన్సిల్ లో సగం మంది సభ్యులు ఇస్లామిక్ న్యాయనిపుణులు ఉంటారు. సుప్రీం లీడర్ ఇరాన్ అధ్యక్షుడు, పార్లమెంట్ నిపుణుల అసెంబ్లీ, స్థానిక కౌన్సిల్స్ అన్నింటీని ఎంపిక చేస్తాడు. అయితే, వీటికి పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా గార్డియన్ కౌన్సిల్ ధృవీకరణ పొందాలి. ఇదంతా సాధారణ పరిస్థితుల్లో జరిగే ప్రక్రియ. ఇక ఇరాన్ అధ్యక్షుడిని ప్రజలు నేరుగా సాధారణ ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతాయి. అయితే, పోటీచేసే అభ్యర్థులు గార్డియన్ కౌన్సిల్ ధ్రువీకరణ పొంది ఉండాలి. ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా వ్యవహరించగలడు.
Also Read: బాధ్యతలు చేపట్టిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు
ఇరాన్ లో ప్రస్తుత పరిస్థితి..
Iran President Election: ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. సాధారణ ఎన్నికలు జరిగే విధానంలో ముందు చెప్పుకున్న విధంగా జరిగిపోతుంది. కానీ, ఇలా ఎవరైనా అధ్యక్షడుడు ఆకస్మిక మరణం సంభవించినట్లయితే, ఆర్టికల్ 131 ప్రకారం మొదటి ఉపరాష్ట్రపతికి యాభై రోజులపాటు ఈ బాధ్యతను అప్పగించవచ్చు. ఇక్కడ మీకో అనుమానం రావచ్చు.. మొదటి ఉపరాష్ట్రపతి ఏమిటి అని. ఇరాన్ లో మొత్తం 14 మంది ఉపరాష్ట్రపతులు ఉంటారు. వారిలో మొదటి వారు మొదటి ఉపరాష్ట్రపతిగా పరిగణిస్తారు. అయితే, దీనికి ఇరాన్ సుప్రీం లీడర్ అంటే అయతుల్లా ఖమేనీ ఆమోదం అవసరం అవుతుంది. దీని ప్రకారం ఇరాన్ తొలి వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్ ఇప్పుడు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కానీ, రాజ్యాంగం ప్రకారం ఈయన 50 రోజులు మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగగలరు. ఈలోపు అధ్యక్ష ఎన్నికకు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది.